పుట్టలో నుంచి వచ్చే చెదలు మాదిరిగా చైనా సైనికులు భారత సరిహద్దులకు చేరుతున్నారు. మరోపక్క ఆ దేశ విదేశాంగశాఖ చర్చల పేరుతో భారత్‌ను ఆపుతోంది. మన ప్రభుత్వానికి పరిస్థితి అర్థమైంది. చర్చల కాలహరణ భారత్‌కు ప్రమాదకరమని గ్రహించింది. అత్యంత వేగంగా సరిహద్దులకు శతఘ్నులు, యుద్ధట్యాంకులను తరలించడమే తరోణాపాయమని భావించింది. అంతే, వాయుసేనలోని బాహుబలులు, భారీ కాయులు రంగంలోకి దిగారు. భారత్‌కు చెందిన వ్యూహాత్మక ఆయుధాలను సరిహద్దులకు చేర్చారు. భారత్ అంత వేగంగా మోహరించగలదని చైనా కూడా అంచనా వేయలేకపోయింది.
అరుదైన వైమానిక సంపద మన సొంతం..
భారత్ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు, భారీ యుద్ధశకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలించవచ్చు. వీటిల్లో సీ17 గ్లోబ్‌మాస్టర్, సీ 130 సూపర్ హెర్క్యూలెస్, సీహెచ్ 47 షినూక్, ఎంఐ17 హెలికాప్టర్లు వంటివి రంగంలోకి దిగాయి. 1980 వరకు భారత్ వద్ద ఐఎల్76, ఏఎన్32 వంటివి ఉండేవి. ప్రస్తుతం వీటితోపాటు కొన్నేళ్లుగా అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు.
టీ-90లే కీలకం..
భారత అమ్ముల పొదిలో టి-90 అత్యంత శక్తివంతమైన ట్యాంక్. దీనిని సరిహద్దులకు తరలించడంతో మన బలగాలకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లే. దీని బరువు దాదాపు 46టన్నులకు పైగా ఉంది. గతంలో ఐఎల్ 76 విమానం అత్యధికంగా 45 టన్నులు మాత్రమే మోయగలదు. దీంతో సీ17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు ఈ ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషించనున్నాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోయగలవు. అత్యధిక ఎత్తుల్లో సాధారణంగా విమానాలు పూర్తి సామర్థ్యంతో బరవు మోయలేవు. సీ17 సామర్థ్యం తగ్గించుకొన్నా.. 46టన్నులను తేలిగ్గా రవాణ చేయగలదు. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డుమార్గంలో కశ్మీర్ వైపు నుంచి తరలించే అవకాశం ఉంది.
శతఘ్నుల తరలింపునకు షినూక్‌లు..
భారత్‌కు చెందిన శతఘ్నులను అత్యవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన షినూక్ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇవి భారత్ వద్ద 15 వరకు ఉన్నాయి. అదేసమయంలో దళాలు, ఆర్మర్డ్ వాహనాలను తీసుకెళ్లెందుకు సీ130 విమానాలు, ఎంఐ17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్ వద్ద 11 సీ130 విమానాలు, 11 సీ17గ్లోబ్‌మాస్టర్లు సర్వీసులో ఉండగా. 220 ఎంఐ 17 హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిల్లో అన్ని లద్దాక్ సమీపంలోని దౌలత్‌బేగ్ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ కాగలిగే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం.