Tuesday, June 14, 2022

ఇరాన్‌లో కోవర్ట్‌ ఆపరేషన్లకు ఇజ్రాయెల్‌ కట్టప్పలు..?

ఇరాన్‌లో కోవర్ట్‌ ఆపరేషన్లకు ఇజ్రాయెల్‌ కట్టప్పలు..?

యుద్ధం అంచున ఇరుదేశాలు..

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకొన్నాయి. ఇప్పటి వరకు ముసుగులో సాగిన పరోక్ష యుద్ధం.. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారుతోందా.. అనే భయాలు  మొదలయ్యాయి. ఇప్పటికే యూరేషియా ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచం సతమతమవుతుంటే.. ఇప్పుడు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అణుబాంబు తయారీకి ఇరాన్‌ చేరువగా వెళుతోందనే సమాచారంతో ఇజ్రాయెల్‌ ఒక్కసారిగా అప్రమత్తమైపోయింది. తన కీలక ఆయుధాలకు పదునుపెట్టడంతోపాటు.. ఇరాన్‌ మిత్రదేశాల్లోని తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరుతోంది. 

ఇరాన్‌ అణు సామర్థ్యమే లక్ష్యంగా ఎఫ్‌-35లకు పదును 

ఇరాన్‌ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ పనిచేస్తోంది. తాము అవసరమైతే ఇరాన్‌పై ముందస్తు దాడి చేయడానికీ వెనుకాడమని గతంలోనే ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇటువంటి ఆపరేషన్‌కు అనుగుణంగా వాడుకొనేలా ఆయుధాలను సిద్ధం చేస్తోంది. తాజాగా అత్యాధునిక స్టెల్త్‌ విమానం ఎఫ్‌-35ను ఎటువంటి గగనతల ఇంధన రిఫ్యూయలింగ్‌  అవసరం లేకుండా ఇరాన్‌లోని లక్ష్యాలను చేరుకొని వచ్చేలా మార్పులు చేసినట్లు జెరుసలెం పోస్టు ప్రకటించింది. దీంతోపాటు రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ వెపన్‌ సిస్టమ్‌ తయారు చేసిన టన్ను బరువైన బాంబును ప్రయోగించేలా మార్పులు చేశారు. అదే సమయంలో విమానం స్టెల్త్‌ దెబ్బతినకుండా చూసుకొన్నారు. ఇరాన్‌ రాడార్లను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కూడా ఇప్పటికే ఇజ్రాయెల్‌ వాయుసేన సాధన చేసింది.

గతంలో ఇరాక్‌ అణ్వాయుధ తయారీ ప్లాంట్‌ను ఇజ్రాయెల్‌ ‘ఆపరేషన్‌ ఒపేరా’ నిర్వహించి ధ్వంసం చేసింది. ఇరాక్‌ 1976లో ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన ఓ న్యూక్లియర్‌ రియాక్టర్‌ను బాగ్దాద్‌కు 17  కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తోందని ఇజ్రాయెల్‌ గుర్తించింది. దీనిని ధ్వంసం చేయడానికి 1981 జూన్‌ 7వ తేదీ ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధవిమానాలు ఆ కేంద్రంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్‌ గగనతల నిఘా రాడార్లను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. అంతే ఇజ్రాయెల్‌ విమానాలు ఆ అణు రియాక్టర్‌పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. క్షణాల్లో ఈ ఆపరేషన్‌ ముగిసిపోయింది.

లెబనాన్‌, ఇరాక్‌ వంటి ప్రాంతాల్లో హెజ్బోల్లా గ్రూప్‌నకు ఆయుధాల ఎగుమతికి ఇరాన్‌ ముఖ్యంగా సిరియా మార్గాన్ని ఎంచుకొంటోంది. తాజాగా ఇరాన్‌కు చెందిన ఆయుధాలను సిరియాలో డమాస్కస్‌ విమానాశ్రయంలో ఇజ్రాయెల్‌ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఇటీవల సిరియాలోని ఐఆర్‌జీసీ సంస్థ స్థావరాలు, నాయకులను ఇజ్రాయెల్‌ నేరుగా లక్ష్యంగా చేసుకొంటోంది. తాజా దాడి కూడా దానిలోని భాగమే.

ఇస్తాంబుల్‌ను వీడండి.. తమ పౌరులకు ఇజ్రాయెల్‌ హెచ్చరిక..

ఇజ్రాయెల్‌ వాసులు టర్కీ నగరం ఇస్తాంబుల్‌కు ప్రయాణించవద్దని.. ఇప్పటికే అక్కడ ఉంటే వెంటనే ఆ నగరాన్ని వీడాలని హెచ్చరించింది. ఇరాన్‌ ప్రోత్సాహంతో ఇజ్రాయెల్‌ ప్రజలపై దాడి జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇస్తాంబుల్‌పై లెవల్‌-4 హెచ్చరికను జారీ చేసింది. టర్కీపై లెవల్‌-3 హెచ్చరికలను విడదల చేసింది. ఇరాన్‌కు చెందిన ఖుద్స్‌ఫోర్స్‌ విభాగాలు ఇక్కడ ఇజ్రాయెల్‌ ప్రజలను లక్ష్యంగా చేసుకోనున్నాయనే నమ్మకమైన సమాచారంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది.

కోవర్ట్‌ ఆపరేషన్లకు పదును..

ఓ వైపు సైనిక దళాలను సిద్ధం చేసుకొంటూనే ఇజ్రాయెల్‌ కోవర్టు ఆపరేషన్లకు మరింత పదును పెట్టింది. ఇరాన్‌ శాస్త్రవేత్తలు, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్లను లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడుతోంది. తాజాగా ఇరాన్‌ వైమానిక పరిశ్రమలో పనిచేస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు 13వ తేదీన అల్‌జజీరా పత్రిక పేర్కొంది. ఖొమేని నగరంలో ఐఆర్‌జీసీ ఏరోస్పేస్‌ డివిజన్‌లో పనిచేస్తున్న అలీ కమానీ అనే ఇంజినీరు అనుమానాస్పద స్థితిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఏరోస్పేస్‌ విభాగంలో పనిచేసే మహమ్మద్‌ అబ్బాస్‌ కూడా సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఇరాన్‌ పత్రిక ఫార్స్‌న్యూస్‌ పేర్కొంది. ఇరాన్‌.. పైకి ఇవి సాధారణ మరణాలే అని చెబుతున్నా.. వీరిద్దరికి  ‘అమర వీరుల’ హోదాను ఇచ్చింది. సాధారణంగా ఇరాన్‌లో ప్రత్యర్థులతో పోరాడుతూ మరణించిన వారికే ‘అమరవీరుల’ హోదా దక్కుతుంది. ఈ వరుస హత్యలపై ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్‌ ఖతీబ్జాదే మాట్లాడుతూ ‘‘ఇజ్రాయెల్‌ ఉగ్రవాదులకు సరైన చోట.. సరైన సమయంలో సమాధానం చెబుతాం’’ అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ల అభివృద్ధి ప్రాజెక్టులో పనిచేస్తున్న కీలక శాస్త్రవేత్త  అయూబ్‌ ఎతెజారె అనుమానాస్పద స్థితిలో మే 31వ తేదీన మృతి చెందారు. ఒక వేడుకలో ఆహారం తిన్నాక అతడు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత ఆ పార్టీ ఇచ్చిన వ్యక్తి దేశం విడిచిపారిపోయాడని ‘న్యూయార్క్‌ పోస్టు ’కథనంలో పేర్కొంది. ఇరాన్‌ అత్యంత రహస్యంగా అభివృద్ధి చేస్తున్న క్షిపణి ప్రాజెక్టులో అయూబ్‌ కీలక శాస్త్రవేత్తగా పేర్కొంది. ఇరాన్‌ ఒక వేళ అణుబాంబును తయారు చేస్తే.. దానిని ప్రయోగించే సామర్థ్యమున్న క్షిపణిని తయారు చేయనీయకుండానే ఈ కోవర్టు ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు.

ఇప్పటికే ఇరాన్‌ ఐఆర్‌జీసీ ఖుద్స్‌ ఫోర్స్‌లోని  ‘యూనిట్‌ 840’ దళంలో సీనియర్‌ కర్నల్‌ హసన్‌ సయ్యద్‌ ఖొదాయోను ఇరాన్‌ రాజధాని  టెహ్రాన్‌లో పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కర్నల్‌ అలీ ఇస్మాయిల్‌ జాదే  ఆ తర్వాత కొన్ని వారాలకే అనుమానాస్పదంగా మృతి చెందాడు. 

ఇరాన్‌ అణుదిశగా అడుగులు..

ఇరాన్‌ అణ్వాయుధం తయారీ దిశగా అడుగులు వేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. నటాంజ్ అణు కేంద్రంలోని కెమెరాలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.  టెహ్రాన్‌కు దాదాపు 250 మైళ్ల దూరంలో ఈ యురేనియం శుద్ధి కేంద్రం ఉంది. యురేనియం-238 శుద్ధి చేసి ఆయుధాలకు అవసరమైన యూ-235ను తయారు చేస్తారు. ఈ శుద్ధికి సెంట్రిఫ్యూజిలు అనే పరికరాలను వాడతారు. మొదటి తరం సెంట్రిఫ్యూజ్‌ కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో యురేనియంను శుద్ధి చేసే ఐఆర్‌-6 సెంట్రిఫ్యూజ్‌లను నటాంజ్‌లో నెలకొల్పదలచినట్లు ఇరాన్‌ గతంలోనే తెలిపింది. అణ్వస్త్ర తయారీకి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం కావాలి. ఇరాన్‌ ఇంతవరకు 60 శాతం శుద్ధి సామర్థ్యాన్ని సంతరించుకుంది. దీంతో ముందస్తుదాడికి కూడా వెనుకాడమని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Monday, June 14, 2021

T Cell: వైరస్‌ ‘టి’క్క కుదిర్చే కణాలు!

14/06/2021

T Cell: వైరస్‌ ‘టి’క్క కుదిర్చే కణాలు!
కరోనా ఎత్తులను చిత్తు చేసేలా ప్రతిదాడి

T Cell: వైరస్‌ ‘టి’క్క కుదిర్చే కణాలు!

బర్మింగ్‌హామ్‌: వైరస్‌ సోకడం లేదా టీకా పొందడం వల్ల మన శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. అయినా వైరస్‌లు తెలివిగా వీటి కళ్లుగప్పుతుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మన రోగనిరోధక వ్యవస్థలోని టి కణాలు.. ఇలాంటి ఎత్తులను చిత్తు చేస్తాయని తెలిపారు. మానవ కణంలోకి ప్రవేశించిన వైరస్‌.. దాన్ని ఒక కర్మాగారంలా ఉపయోగించుకుంటూ స్వీయ ప్రతులను తయారు చేసుకుంటుంది. ఆ తర్వాత కణాన్ని నాశనం చేసి, కొత్త కణాల్లోకి చేరి.. అక్కడా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుంది. ఈ వైరస్‌ను అడ్డుకోవడంలో మన యాంటీబాడీలు ఉపయోగపడతాయి. అవి వైరస్‌కు అతుక్కోవడం ద్వారా మన కణాల్లోకి వాటి ప్రవేశాన్ని నిలువరిస్తాయి. అయితే పొరుగునున్న కణాలకు వ్యాప్తి చెందడం కోసం మొదటి కణం నుంచి వైరస్‌ బయటకు రాకుంటే పరిస్థితి ఏంటి? వాటిపై మన యాంటీబాడీలు సమర్థంగా పనిచేస్తాయా? ఈ అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు.

సూపర్‌ కణాలు..
అత్యంత ఎక్కువ సంక్రమణ శక్తి కలిగిన కరోనా వైరస్‌.. మానవ కణాలనూ మార్చేస్తుంది. అది రెండు మూడు మానవ కణాలు ఒక్కటిగా కలిసిపోయేలా చేస్తుంది. ఇలా ఏర్పడిన ‘సూపర్‌ కణాలు’ భారీ వైరల్‌ ఫ్యాక్టరీలుగా తయారవుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ద్వారా వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటుందని తేల్చారు. ఈ సూపర్‌ కణాలను ‘సిన్సీషియా’గా పేర్కొంటారు. వీటిలో అనేక కేంద్రకాలు (న్యూక్లియస్‌- కణంలో జన్యుపదార్థం కలిగి ఉండే భాగం), అధికంగా సైటోప్లాజమ్‌ (కేంద్రకం చుట్టూ జిగురులా ఉండే పదార్థం) ఉంటాయి. మరింత సమర్థంగా తన ప్రతులను పెంచుకోవడానికి వైరస్‌కు అవి తోడ్పడతాయి. అలాగే ఈ చర్య ద్వారా.. యాంటీబాడీల బారినపడకుండానే తన వనరులను వైరస్‌ పెంచేసుకుంటుంది. ఈ యాంటీబాడీలు కణాల వెలుపల మాత్రమే సంచరిస్తుంటాయి.

కణం నుంచి కణానికి
దక్షిణాఫ్రికాకు చెందిన అలెక్స్‌ సిగల్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కరోనా వైరస్‌లోని ఆల్ఫా, బీటా వేరియంట్లపై ప్రయోగాలు నిర్వహించింది. ఒక కణం నుంచి బయటకు రాకుండా.. నేరుగా మరో కణంలోకి ఇవి వ్యాప్తి చెందగలవని, తద్వారా యాంటీబాడీలను ఏమార్చగలవని గుర్తించారు. దీన్నిబట్టి.. ఒక కణంపై వైరస్‌ తన పట్టును బిగించి, పక్కనున్న కణాలకూ విస్తరిస్తే దాన్ని నిర్మూలించడం కష్టమని తేల్చారు. పరిణామక్రమంలో భాగంగా మన రోగనిరోధక వ్యవస్థ కంట్లో పడకుండా దాగి ఉండే కిటుకులను వైరస్‌లు వంటబట్టించుకున్నాయి. వెలుపలికి రాకుండా కణం నుంచి కణానికి నేరుగా వ్యాప్తి చెందే వ్యూహం ఇందులో భాగమే. ఈ విధానంలో కణాలను కలగలపాల్సిన అవసరం ఉండదు. యాంటీబాడీల నుంచి రక్షణ కోసం కణాల మధ్య ఉండే దృఢ బంధాన్ని వైరస్‌ యుక్తిగా ఉపయోగించుకుంటుంది. అయితే కణంలోకి ప్రవేశించకుండా వైరస్‌ను అడ్డుకోవడంలోనే యాంటీబాడీలు సమర్థంగా పనిచేస్తాయి. అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డ కణాలపై మాత్రం వీటి సమర్థత కాస్త తక్కువగానే ఉంటుంది. దీన్నిబట్టి.. కణం నుంచి కణంలోకి నేరుగా పయనించే వైరస్‌లపై టీకాలు నిష్ప్రయోజనమవుతాయా అన్న ఆందోళన వ్యక్తంకావడం సహజం. అయితే బహుళ పద్ధతుల్లో వైరస్‌లను ఎదుర్కొనే విధానాలను మన రోగనిరోధక వ్యవస్థ అలవర్చుకుందని శాస్త్రవేత్తలు తెలిపారు. టి కణాలూ ఇందులో భాగమే. టీకా పొందినప్పుడు గానీ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు గానీ అవి క్రియాశీలమవుతాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన కణాలను గుర్తించి, వైరస్‌ను చంపేసేలా తర్ఫీదు పొందుతాయి. అందువల్ల వైరస్‌కున్న ‘కణం నుంచి కణానికి వ్యాప్తి’ సామర్థ్యం దీనిపై ప్రభావం చూపబోదు. టి కణాలు మునుపటి ఇన్‌ఫెక్షన్‌ను గుర్తుపెట్టుకోగలవు. అదే వైరస్‌ మరోసారి దాడి చేస్తే వేగంగా స్పందించగలవు.

   
Tags: Coronavirus, Covid19, T cells, Virus attack

Wednesday, July 1, 2020

చైనా క్యాబేజీ వ్యూహం..!


చైనా క్యాబేజీ వ్యూహం..!

 పక్కలో పాము.. పక్కన చైనా ఒకటే..!

 సలామీ స్లైసింగ్‌తో పొరుగు భూభాగాల భక్షణ


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా మార్చినన్ని సార్లు మ్యాప్‌ను మరే దేశం మార్చలేదంటే అంతిశయోక్తికాదేమో.  దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల ఇతర దేశాల భూభాగాల్ని ఆక్రమించిన ఘనత కూడా డ్రాగన్‌కే దక్కుతుంది. ఎప్పటికప్పుడు కొత్తపాట పాడుతూ.. పొరుగు దేశాలతో పేచీలకు దిగడం ఎంతో కొంత భూభాగాన్ని దిగమింగడం డ్రాగన్‌కు అలావాటుగా మారిపోయింది.  అదే సమయంలో యుద్ధాలు వచ్చే స్థాయిలో అక్రమణలకు దిగే ధైర్యం చేయదు. చిన్ని..చిన్న భూభాగాలను మెల్లగా తినేస్తుంది. సైనిక పరిభాషలో దీనిని ‘సలామీ స్లైసింగ్’ అంటారు. 2017లో నాటి ఆర్మీ చీఫ్‌.. నేటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఈ విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేశారు కూడా.

అసలు సలామీ స్లైసింగ్‌ అంటే ఏమిటీ..?

1940 హంగేరియన్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాథ్యూరకోసీ ఈ పదాన్ని వాడాడు. ఎదుట పార్టీలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట. దీనిని ‘క్యాబేజీ వ్యూహం’ అని కూడా  అంటారు. పొరుగు దేశాల్లోని చిన్ని చిన్న ప్రాంతాలు తమవని చెప్పుకొని వాటిని మెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం. మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైన ఉండొచ్చు. పొరుగు దేశం అభ్యంతరం చెబితే శాంతి చర్చలపేరుతో విదేశాంగశాఖ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది. అంతేగానీ, భూభాగాలు వెనక్కి రావు. కిలోమీటర్‌ కోసమో.. కొన్ని వందల మీటర్ల భూభాగం కోసమో పొరుగు దేశాలు యుద్ధానికి దిగవు. చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను దక్కించుకొంటోంది.

గల్వాన్‌ లోయా.. పాంగాంగ్‌ సో సరస్సు కూడా ఇలానే..

భారత్‌లోని గల్వాన్ లోయ, పాంగాంగ్‌ సో సర్సుల వద్ద కూడా చైనా ఇదే వ్యూహాన్ని అమలు  చేయాలని చూస్తోంది. పాంగాంగ్‌ సోలోని ఫింగర్‌ 4 తమదే అని కొత్త వాదన అందుకొంది. వాస్తవానికి చైనా ఫింగర్ 8 వద్దే ఉండాలి. భారత్‌ ఫింగర్ 4 వరకు ఉండాలి. కానీ, ఫింగర్‌ 4 వద్ద వరకు వచ్చేందుకు భౌగోళికంగా అనుకూలంగా ఉండంతో  చైనా దానిని వాడుకొని అక్కడకు వచ్చేసింది. భారత్‌ వైపు నుంచి ఫింగర్ 4 శిఖరానికి చేరడానికి నిట్టనిలువునా కొండ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చైనా ఫింగర్‌ 4తనదే అనే వాదన తెరపైకి తెచ్చింది. ఇక గల్వాన్‌ లోయ గతంలో ఎప్పుడూ వివాదాస్పదంకాలేదు. అది పూర్తిగా భారత్‌ స్వాధీనంలోనే ఉంది. కానీ, భారత్‌ దౌలత్‌ బేగ్‌ ఓల్డీకు రహదారి నిర్మాణం చేపట్టడంతో ఇప్పుడు గల్వాన్‌ లోయ కూడా తనదే అనే వాదన తెచ్చింది.  గతంలో డోక్లాం కూడలి వద్ద కూడా ఇలాంటి సలామీ స్లైసింగ్‌కే ప్రయత్నించింది. కానీ, అప్పట్లో భారత్‌ గట్టిగా నిలబడటంతో తాత్కాలికంగా వెనుదిరిగింది.
అరుణాచల్‌ ప్రదేశ్‌, లద్దాక్‌ వంటి ప్రాంతాల్లో అప్పుడప్పుడు సలామీ స్లైసింగ్‌కు పాల్పడుతూనే ఉంటోంది. 2013లో భారత్‌ 600 చదరపు కిలోమీటర్లను చైనాకు కోల్పోయిందని శ్యామ్‌శరణ్‌ నివేదిక వెల్లడించింది. ఆ భూభాగాన్ని చైనా సలామీ స్లైసింగ్‌ రూపంలోనే ఆక్రమించింది. 

నమ్మిన నేపాల్‌ గొంతు కోస్తూ..

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధికారం నిలుపుకోవడం కోసం చైనాతో కుమ్మకై భారత్‌తో సరిహద్దు వివాదానికి కాలు దువ్వింది. ఇది జరిగి రోజులు గడవక ముందే నేపాల్‌కు చెందిన నాలుగు జిల్లాల్లో దాదాపు 28హెక్టార్ల వ్యూహాత్మక ప్రాంతాన్ని చైనా బలగాలు ఆక్రమించినట్లు ఆ దేశ ఏజెన్సీలే ప్రకటించాయి. అసలు నేపాల్‌, భూటాన్‌లే తమ టిబెట్‌లోని అంతర్భాగాలని చైనా ప్రకటించింది. 1962 తర్వాత ప్రఖ్యాత గోర్‌ఖా జిల్లాలోని ఓ గ్రామాన్ని కబ్జా చేసింది. ఈ విషయం అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా అక్కడ 34, 35, 36, 37, 38 పిల్లర్లను మార్చేసింది. ఈ విషయంపై నేపాల్‌ ప్రభుత్వం కిమ్మనలేదు.  అసలు 2019 వరకు ఏ ప్రభుత్వ అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు.  ఇప్పుడు భారత్‌తో విరోధం పెట్టుకోవడంతో చైనాను ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. 

మరికొన్ని ప్రదేశాల్లో..

దక్షిణ చైనా సముద్రంలో దీవులను ఇలానే ఆక్రమించింది. 1974లో పరాసల్‌ ద్వీపం, 1988లో జాన్సన్‌ రీఫ్‌, 1995లో మిస్‌చెఫ్‌ రీఫ్‌, 2012లో షోల్‌ ఇలా చెప్పుకొంటూ చాలా ఉన్నాయి. కేవలం భారత్‌ మాత్రమే చైనా సలామీ స్లైస్‌ను కొంత బలంగా అడ్డుకొంది. ఇటీవల గల్వాన్ లోయలో చైనా సైనికులకు బలంగా బుద్ధిచెప్పడంతో మళ్లీ చర్చలు అంటూ కొత్తరాగం అందుకొంది. 

 galwan valley

లద్దాఖ్‌ దిశగా బాహుబలులు

లద్దాఖ్‌ దిశగా బాహుబలులు

 పుట్టలో నుంచి వచ్చే చెదలు మాదిరిగా  చైనా సైనికులు భారత సరిహద్దులకు చేరుతున్నారు. మరోపక్క ఆ దేశ విదేశాంగశాఖ చర్చల పేరుతో భారత్‌ను ఆపుతోంది. మన ప్రభుత్వానికి పరిస్థితి అర్థమైంది. చర్చల కాలహరణ భారత్‌కు ప్రమాదకరమని గ్రహించింది. అత్యంత వేగంగా సరిహద్దులకు శతఘ్నులు, యుద్ధట్యాంకులను తరలించడమే తరోణాపాయమని భావించింది. అంతే, వాయుసేనలోని బాహుబలులు, భారీ కాయులు రంగంలోకి దిగారు. భారత్‌కు చెందిన వ్యూహాత్మక ఆయుధాలను సరిహద్దులకు చేర్చారు. భారత్‌ అంత వేగంగా మోహరించగలదని చైనా కూడా అంచనా వేయలేకపోయింది.  

అరుదైన వైమానిక సంపద మన సొంతం..

భారత్‌ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు, భారీ యుద్ధశకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలించవచ్చు. వీటిల్లో సీ17 గ్లోబ్‌మాస్టర్‌, సీ 130 సూపర్‌ హెర్క్యూలెస్‌, సీహెచ్‌ 47 షినూక్‌, ఎంఐ17 హెలికాప్టర్లు వంటివి రంగంలోకి దిగాయి.  1980 వరకు భారత్‌ వద్ద ఐఎల్‌76, ఏఎన్‌32 వంటివి ఉండేవి.  ప్రస్తుతం వీటితోపాటు కొన్నేళ్లుగా అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు. 

టీ-90లే కీలకం..

భారత అమ్ముల పొదిలో టి-90 అత్యంత శక్తివంతమైన ట్యాంక్‌. దీనిని సరిహద్దులకు తరలించడంతో మన బలగాలకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లే.  దీని బరువు దాదాపు 46టన్నులకు పైగా ఉంది. గతంలో ఐఎల్‌ 76 విమానం అత్యధికంగా 45 టన్నులు మాత్రమే మోయగలదు. దీంతో సీ17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాలు ఈ ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషించనున్నాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోయగలవు. అత్యధిక ఎత్తుల్లో సాధారణంగా విమానాలు పూర్తి సామర్థ్యంతో బరవు మోయలేవు. సీ17 సామర్థ్యం తగ్గించుకొన్నా.. 46టన్నులను తేలిగ్గా రవాణ చేయగలదు. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డుమార్గంలో కశ్మీర్‌ వైపు నుంచి తరలించే అవకాశం ఉంది. 

శతఘ్నుల తరలింపునకు షినూక్‌లు..

భారత్‌కు చెందిన శతఘ్నులను అత్యవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన షినూక్‌ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇవి భారత్‌ వద్ద 15 వరకు ఉన్నాయి.  అదేసమయంలో దళాలు, ఆర్మర్డ్‌ వాహనాలను తీసుకెళ్లెందుకు సీ130 విమానాలు, ఎంఐ17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్‌ వద్ద 11 సీ130 విమానాలు, 11 సీ17గ్లోబ్‌మాస్టర్లు  సర్వీసులో ఉండగా. 220 ఎంఐ 17 హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిల్లో అన్ని లద్దాక్‌ సమీపంలోని దౌలత్‌బేగ్‌ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్‌ కాగలిగే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం.

Thursday, June 25, 2020

పోలవరం శరవేగం

పోలవరం శరవేగం

25 Jun, 2020

దశాబ్దాల స్వప్నం సాకారం దిశగా వడివడిగా అడుగులు

గడువులోగా పూర్తి చేయడానికి సీఎం జగన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపకల్పన

ఎప్పటికప్పుడు సమీక్షలు.. సంప్రదింపులతో డిజైన్లన్నింటికీ మోక్షం

రోజుకు సగటున స్పిల్‌ వేలో వెయ్యి, స్పిల్‌ చానల్‌లో

రెండు వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు

స్పిల్‌ వే బ్రిడ్జిని పూర్తి చేసి వరదల్లోనూ పనులు చేసేలా ఏర్పాట్లు

త్వరితగతిన కాఫర్‌ డ్యామ్‌లు.. సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ పనులు

2022 జూన్‌లో ఆయకట్టుకు నీళ్లందించే దిశగా అడుగులు

అది పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతం.. భారీ క్రేన్లు.. రెడీమిక్సర్లతో సందడి సందడిగా ఉంది.. వందల కొద్దీ కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు చకచకా సాగిపోతున్నాయి. పనులు పర్యవేక్షిస్తున్న ఎస్‌ఈ నాగిరెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. స్పిల్‌ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల చొప్పున కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని, మే, 2021 నాటికి 48 గేట్లను బిగించి, స్పిల్‌వేను పూర్తి చేస్తామని చెప్పారు. ‘వరదలు తగ్గాగానే.. నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీని భర్తీ చేసి.. నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను జూలై, 2021 నాటికి పూర్తి చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించి.. 2021, డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం’ అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, పకడ్బందీ ప్రణాళిక, అకుంఠిత దీక్షకు పోలవరం ప్రాజెక్టు పనులు అద్దం పడుతున్నాయి. దశాబ్దాల స్వప్నం శరవేగంగా చేరువవుతోంది. ఇంజనీరింగ్‌ అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఉరకలెత్తే గోదారమ్మకు బ్రేకులేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 

ఎలాంటి హడావుడి లేకుండా, ప్రచారార్భాటాలకు దూరంగా.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులు చకచకా సాగుతున్నాయి. కరోనా భయపెడుతున్న వేళ సైతం కట్టుదిట్టమైన చర్యలతో రికార్డు స్థాయిలో పనులు పరుగులు పెడుతున్నాయి.

(రామగోపాలరెడ్డి ఆలమూరు) 
పోలవరం ప్రాజెక్టు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట వద్ద ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదన 1941లో బ్రిటీష్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలుగు నేల సుభిక్షమవుతుందని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారు. కానీ.. ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా 2004 వరకూ ఏ ముఖ్యమంత్రీ సాహసించలేదు. 2004లో దివంగత సీఎం వైఎస్సార్‌ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. కానీ.. వైఎస్సార్‌ హఠాన్మరణంతో పోలవరం పనులు మందగించాయి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గత ప్రభుత్వం అందిపుచ్చుకుని, ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో విఫలమైంది. కమీషన్ల కోసం జీవధార పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది. జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసి.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖాజనాకు రూ.838.51 కోట్లను ఆదా చేశారు.

టీడీపీ సర్కారు ఐదేళ్లలో రోజుకు సగటున 131.59 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించినప్పటి నుంచి రోజుకు సగటున 3,000 క్యూబిక్‌ మీటర్ల పనులు చేస్తోంది. 

ప్రణాళికాయుతంగా పనులు
► టీడీపీ సర్కార్‌ ప్రణాళిక లోపం.. అవగాహన రాహిత్యం, చిత్తశుద్ధి లేమి పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయి. పనులు గందరగోళంగా మారాయి. ఈ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021లోగా పూర్తి చేయడానికి సీఎం  జగన్‌ కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌) రచించారు. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. ఈ ప్రణాళిక అమలును సీఎం జగన్, మంత్రి అనిల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిజైన్లకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) నుంచి ఆమోదం తెచ్చారు. దాంతో పనులు చేపట్టడానికి మార్గం సుగమమైంది.

కరోనా కోరలు చాస్తున్నా నిర్విఘ్నంగా పనులు 
► గత సీజన్‌లో వరదలు తగ్గాక.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ మధ్యలో నిలిచిన నీటిని డీవాటరింగ్‌ చేసి నవంబర్‌లో పనులు ప్రారంభించారు.
► కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం లాక్‌ డౌన్‌ విధించింది. దాంతో కార్మికులు బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వారి ఊళ్లకు వెళ్లారు. సొంతూళ్లకు చేరుకున్న రెండు వేల మందికిపైగా కార్మికుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మేఘా (మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌) భరోసా కల్పించి.. ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించాయి. కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ స్పిల్‌ వేలో వెయ్యి క్యూబిక్‌ మీటర్లు.. స్పిల్‌ చానల్‌లో రెండు వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో కాంక్రీట్‌ పనులు రోజూ చేస్తున్నారు. బుధవారం వరకూ 2.77 లక్షల క్యూబిక్‌ మీటర్ల (స్పిల్‌ వేలో 1.29, స్పిల్‌ చానల్‌లో 0.98 లక్షల) పనులు చేశారు. స్పిల్‌ వేలో 2.62 లక్షలు, స్పిల్‌ చానల్‌లో 6.98 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేస్తే స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పూర్తవుతాయి. ఈ పనులు 2021 మే నాటికి పూర్తవుతాయి.
► గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టగానే ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో మిగిలిన 35.82 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను నవంబర్‌లో ప్రారంభించి.. 2021 జూలై నాటికి పూర్తి చేసేలా చేపడతారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో మిగిలిన 22.09 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను 2021 జూలై నాటికి పూర్తి చేస్తారు. గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్‌ వే మీదుగా నవంబర్‌ నుంచే మళ్లిస్తారు. 
► ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ పనులను ప్రారంభించి.. 117.69 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తారు. ఆలోగా కాలువలకు జలాశయంతో అనుసంధానం చేసే పనుల (కనెక్టివిటీస్‌)ను పూర్తి చేసి.. 2022 జూన్‌లో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించింది.

ఇది మీకు తెలుసా? 
ప్రస్తుతం ప్రపంచంలో గరిష్టంగా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలను విడుదల చేసే సామర్థ్యంతో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను చైనా నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రాగన్‌’ను తలదన్నేలా అత్యధికంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను నిర్మిస్తోంది. గోదావరి నదికి అడ్డంగా మూడు కొండల మధ్యన ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఇసుక తిన్నెలపై అతి పొడవైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ ఇదే.

పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీపై కుడి, ఎడమ కాలువల కింద 7.2 లక్షల ఎకరాలు.. గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు వెరసి 38.70 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. ప్రపంచంలో గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది.


వరదలు వచ్చినా పనులు కొనసాగించేలా ప్రణాళిక
► గోదావరి నదికి ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తేనే స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌కు వరద జలాలు చేరుతాయి. జూలై ఆఖరుకు ఆ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ పనులను కొనసాగించనున్నారు. 
► స్పిల్‌ వే పియర్స్‌ 52 మీటర్లకు పూర్తి చేసి.. వాటికి గడ్డర్లు బిగించి.. వాటిపై స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ను వేసే పనులు చేపట్టి.. నవంబర్‌ నాటికి వాటిని పూర్తి చేస్తారు. నవంబర్‌ తర్వాత స్పిల్‌ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–3 పనులు చేపడతారు. నవంబర్‌లో డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ప్రారంభించి.. 2021 డిసెంబర్‌కు పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు.

నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి 
► టీడీపీ సర్కార్‌ నిర్వాకం వల్ల గతేడాది 41.15 మీటర్ల కాంటూర్‌కు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలూ.. వరద ముప్పును ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై నాటికి 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 15,444 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సర్కార్‌ నిర్ణయించింది.
► పునరావాసం కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 45.72 మీటర్ల పరిధిలో కాంటూర్‌ 82 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. సహాయ, పునరావాసం పనులకే రూ.30 వేల కోట్లకుపైగా సర్కార్‌ వ్యయం చేస్తోంది. 

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నాం 
– మంత్రి అనిల్‌
పోలవరం ప్రాజెక్టుకు మహానేత వైఎస్సార్‌ నడుం బిగించారు. విభజన నేపథ్యంలో వంద శాతం ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. టీడీపీ సర్కార్‌ కమీషన్‌ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది.  జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పోలవరం పనుల్లో రూ.838.51 కోట్లు ఆదా చేశాం. 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించి, ఆ దిశగా చర్యలు చేపట్టాం. 2022 జూన్‌ నాటికి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా వైఎస్సార్‌ ప్రారంభించిన పోలవరాన్ని ఆయన తనయుడు సీఎం  జగన్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

పొక్లెయిన్‌తో టన్నుల కొద్దీ మట్టిని తవ్వి.. టిప్పర్లలోకి పొసి.. తరలిస్తున్నారు. మరో వైపు ఇసుక, కంకర పోస్తూ రోలర్‌తో తొక్కించి.. గట్టిపరిచి.. వాటిపై రెడీ మిక్సర్లతో తెచ్చిన కాంక్రీట్‌ను పోసి.. స్పిల్‌ వేలో బ్లాక్‌లు వేస్తున్నారు. ఒక్కో బ్లాక్‌లో వంద క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేస్తామని.. రోజుకు 20 బ్లాక్‌ల పనులు చేస్తున్నామని స్పిల్‌ చానల్‌ పనులు పర్యవేక్షిస్తున్న డీఈ శ్రీనివాసరావు చెప్పారు. స్పిల్‌ చానల్‌ను మార్చి, 2021 నాటికి పూర్తి చేస్తామని వివరించారు

Saturday, June 20, 2020

చైనా గొడవ మనతోనే కాదు..

జూన్ 20, 2020

చైనా గొడవ మనతోనే కాదు.. 

గాల్వన్‌ ఘటన.. మరోసారి భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు తెర లేపింది. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతున్న చైనా.. ఇటీవల భారత్‌లోని గాల్వన్‌ లోయలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మన జవాన్లు ప్రాణాలు అర్పించి నిలువరించారు. డ్రాగన్ చైనాకు కేవలం మన దేశంతోనే కాదు.. తన సరిహద్దు దేశాలు, సరిహద్దులో లేని దేశాలతోనూ గొడవలకు దిగుతోంది. తనది కాని భూభాగాన్ని దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో చైనా ఏయే దేశాలతో గొడవలు పడుతుందో చూద్దాం..

భారత్‌తో వైరం
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా కుతంత్రాలు చేస్తోంది. భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ వాదనకు దిగుతోంది. ఇరు దేశాల మధ్య మెక్‌మోహన్‌రేఖ, క్లెయిమ్‌ లైన్‌, వాస్తవ ఆధీన రేఖ  ఉన్నా.. వాటిని దాటి భారత్‌లోకి చొరబడుతోంది. 1914లో భారత్‌లోని బ్రిటన్‌ ప్రభుత్వం నేతృత్వంలో భారత్‌, చైనా, టిబెట్‌ మధ్య సరిహద్దులు ఏర్పాటు అయ్యాయి. అయితే దీన్ని చైనా ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ను టిబెట్‌లో భాగంగానే భావిస్తోంది. అలాగే లద్దాఖ్‌లోని అక్సాయ్‌ చిన్‌, దెమ్‌చాక్‌ ప్రాంతాన్ని, చంబూ వ్యాలీని చైనా తమదేనంటోంది. ఈ క్రమంలో భారత్‌, చైనా మధ్య యుద్ధాలు కూడా జరిగాయి.

ఐలాండ్స్‌ కోసం ఆరాటం
తూర్పు చైనా సముద్రంలో జపాన్‌ ఆధీనంలో ఉన్న కొన్ని ఐలాండ్స్‌ సమూహాన్ని కైవసం చేసుకోవాలని 1970 నుంచి చైనా యత్నిస్తోంది. జపాన్‌.. చైనా.. తైవాన్‌ మధ్యలో ఈ ఐలాండ్స్‌ ఉన్నాయి. వీటిని సెంకకు ఐలాండ్స్‌ అని జపాన్‌, డివోయూ ఐలాండ్స్‌ అని చైనా, తియాయూటై అని తైవాన్‌ పిలుస్తున్నాయి. 1945 నుంచి 1972 వరకు అమెరికా పాలనలో ఉన్న ఈ ఐలాండ్స్‌ను ప్రస్తుతం జపాన్‌ ఆధీనంలో ఉన్నాయి. అయితే 1970లో ఈ ఐలాండ్స్‌లో చమురు నిల్వలు, మత్స్య సంపద ఉన్నట్లు గుర్తించారు. సముద్ర మార్గ రవాణాకు మంచి సౌలభ్యం ఉండటంతో చైనా కన్ను ఆ ఐలాండ్స్‌పై పడింది. జపాన్‌ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ.. వాటిని ఆక్రమించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ  ఐలాండ్స్‌ తమవేనని వాదిస్తోంది. తైవాన్‌ చైనాలో భాగమైనప్పటికి అవి తమకు చెందినవేనని వాదిస్తోంది.

వియత్నాంతో కయ్యం
వియత్నాంపై కూడా చైనా తన దురాక్రమాలను ప్రదర్శించింది. ఆ దేశంలో దాదాపు 50 ప్రాంతాలను స్వాధీనం చేసుకునే యత్నం చేసింది. స్పార్ట్‌లీ ఐలాండ్స్‌ను ఆక్రమిస్తోంది. ఈ క్రమంలో చైనా-వియత్నాం మధ్య 1979 నుంచి 1991 వరకు పలుమార్లు యుద్ధాలు కూడా జరిగాయి. ఈ ఐలాండ్స్‌ తమవేనంటూ తైవాన్‌, ఫిలిప్పిన్స్‌ కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

నదీ ప్రాంతంపై నార్త్‌ కొరియాతో..
ఉత్తర కొరియా, చైనా మధ్యలో ఉన్న యాలూ నదీ.. అందులోని ఐలాండ్స్‌పై ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నదీపై సర్వహక్కులను చైనా, ఉత్తర కొరియా సమానంగా పంచుకున్నాయి.

తమవేనంటూ..
దక్షిణ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పిన్స్‌ మధ్య ఉన్న స్కార్‌బేరా మట్టి దిబ్బ విషయంలో ఇరు దేశాలు గొడవలు పడుతున్నాయి. 2012లో ఈ చిన్న మట్టి దిబ్బ వద్దకు చైనాకు చెందిన కొందరు చేపల వేటకు వెళ్లారు. ఫిలిప్పిన్స్‌ నేవీ వారిని అరెస్టు చేయబోతే చైనాకు చెందిన నేవీ వారిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి స్కార్‌బేరా చైనా నియంత్రణలో ఉంటోంది. స్పార్ట్‌లీ ఐలాండ్స్ విషయంలో ఇరు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.

కొండ కోసం దక్షిణ కొరియాతో కొరివి
యెల్లో సముద్రంలో సొకొట్రా అనే కొండ ఉంది. సముద్ర మట్టానికి 15 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండ అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికి చెందదు. కానీ దీనిని దక్కించుకోవాలని దక్షిణ కొరియా, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఈ కొండ తమ ఎకానమికల్‌ జోన్‌లోకి వస్తుందంటే కాదు.. కాదు.. మా ఎకానమికల్‌ జోన్‌లోకి వస్తుందని ఇరు దేశాలు వాదిస్తున్నాయి.

భూటాన్‌ను భయపెడుతూ
భారత్‌కు మిత్రదేశమైన భూటాన్‌లో చైనా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. టిబెట్‌లోని భూటాన్‌కు చెందిన కొన్ని ప్రాంతాలతోపాటు డొక్లాంలోనూ చొరబడేందుకు డ్రాగన్‌  ప్రయత్నిస్తోంది. 2017లో చైనా.. డొక్లాంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. దీనిని భూటాన్‌ త్రీవంగా వ్యతిరేకించింది. ఈ విషయం భారత్‌కు తెలియడంతో భారత్‌ బలగాలు డొక్లాంలో చైనా బలగాలను అడ్డుకున్నాయి. 

ఇండోనేషియా ప్రాంతంపై పట్టుకు తైవాన్‌.. చైనా 
తైవాన్‌, చైనాలో భాగమే.. అయినా దక్షిణ చైనా సముద్రంలో ఉన్న స్పార్ట్‌లీ ఐలాండ్స్‌, నాతునా ఐలాండ్స్‌ విషయంలో ఇరు దేశాలు విభేదిస్తున్నాయి. ఆయా ఐలాండ్స్‌ తమవేనంటూ వాదిస్తున్నాయి.

పామిర్‌ పర్వతాల్లో తజికిస్థాన్‌తో తగువులాట
2011లో జరిగిన ఒప్పందం ప్రకారం తజికిస్థాన్‌ పామిర్‌ పర్వతాల్లోని 1,158 స్క్వేర్‌ కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. చైనా తజికిస్థాన్‌లోని 73వేల స్క్వేర్‌ కిలోమీటర్ల ప్రాంతంపై తమ అధికారాలను వదిలేసింది. అయితే కొన్నిసార్లు పామిర్‌ పర్వత ప్రాంతంలో చైనా, తజికిస్థాన్‌ సరిహద్దు విషయంలో తజికిస్థాన్‌ ధోరణి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుండంతో ఇరు దేశాల మధ్య విభేధాలు తలెత్తుతున్నాయి.

మట్టి దిబ్బ కోసం మలేషియాతో గొడవ
దక్షిణ చైనా సముద్రంలో ఉన్న మలేషియాకు చెందిన జేమ్స్‌ మట్టిదిబ్బను కైవసం చేసుకోవడం కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతం తమ పరిధిలోనే ఉందని మలేషియా చెబుతోంది. ఇప్పటికి ఆ ప్రాంతాన్ని తమ పాలనలోనే ఉంచుకున్న మలేషియా చమురు నిలువలు ఉన్నాయోనని పరిశోధిస్తోంది. అయితే చైనాకూ జేమ్స్‌ మట్టిదిబ్బ తమదేనని వాదిస్తోంది. 1981ను నుంచి చైనాకి చెందిన నేవీ పలుమార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించిందని, చైనా మెరైన్‌ సర్విలెయన్స్‌ బృందం కూడా వెళ్లి సార్వభౌమాధికారం తమదేనని తెలిపే శిలాఫలకం కూడా ఏర్పాటు చేసిందని చెబుతోంది. 

వీటితోపాటు అఫ్గానిస్థాన్‌, మంగోలియా, కిర్జికిస్థాన్‌, కాంబోడియా, బ్రూనే, లావోస్‌ దేశాలతోనూ భూభాగం విషయంలో వైరం కొనసాగిస్తోంది. కొన్ని ప్రాంతాలు చైనా సరిహద్దుల్లో లేకున్నా.. పూర్వం చైనాకు చెందినవేనంటూ వితండవాదం వినిపిస్తోంది. 

- ఇంటర్నెట్ డెస్క్‌

Tuesday, June 16, 2020

మగవాళ్లలోనే ఎందుకు కరోనా మరణాలు ఎక్కువ?

మగవాళ్లలోనే ఎందుకు కరోనా మరణాలు ఎక్కువ?

16 Jun, 2020

మాస్ట్‌ కణాలు కారణమే
 పురుషుల్లోనే ఎందుకు ఎక్కువగా మరణిస్తున్నారు ? లేదా స్త్రీలే ఎందుకు ఎక్కువగా బతికి బయట పడుతున్నారు ? అందుకు సామాజిక, వైద్య కారణాలతోపాటు ఎక్కువగా లింగ పరంగా శారీరక నిర్మాణ వ్యవస్థలో ఉన్న తేడాలే కారణమని వైద్య పరిశోధనాంశాల ప్రాతిపదికగా స్పష్టమవుతోంది. స్త్రీ, పురుషుల రోగ నిరోధక శక్తిలో మాస్ట్‌ కణాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అంటురోగాలను ఎదుర్కోవడంలో మాస్ట్‌ కణాలు పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తాయి. మహిళలే ఎక్కువగా జలుబు, దగ్గు లాంటి అలర్జీలకు గురవుతుండడం వల్ల వారిలో మాస్ట్‌ కణాలు క్రియాశీలకంగా మారి ఉండవచ్చు. 

సెక్స్‌ హార్మోన్స్‌ పాత్ర
స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజెన్‌తోపాటు టెస్టోస్టెరోన్‌ అనే రెండు సెక్స్‌ హార్మోన్స్‌ ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌లు ఎక్కువగా ఉంటే పురుషుల్లో టెస్టోస్టెరోన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్స్‌ ఎక్కువ సంఖ్య కారణంగా స్త్రీలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. స్త్రీలలో రెండు రకాల ఎక్స్‌–క్రోమోజోమ్స్‌ ఉంటాయి. అందులో ఒక క్రోమోజోమ్‌లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన జన్యువులు స్తబ్దుగా ఉంటాయి. దాంతో మరో కోమోజోమ్‌లోని జన్యువులు మరింత క్రియాశీలకంగా పని చేస్తాయి. అదే పురుషుల్లో ఉండే ఒకే ఒక్క ఎక్స్‌–క్రోమోజోన్‌లోని జన్యువులకు అంత శక్తి లేదు. 

సామాజిక, వైద్య కారణాలు
స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా పాగ తాగడం, మద్యం సేవించడం, జబ్బును నిర్లక్ష్యం చేయడం, తద్వారా తక్షణమే వైద్య సేవలు అందుకోకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం పురుషల మరణాలకూ కారణం అవుతోంది. స్థూలకాయం, డయాబెటీస్, గుండె జబ్బుల్లో ఉన్న తేడాలు కూడా మరణాల మధ్య తేడాకు కారణం కావచ్చు. అమెరికాలోని ప్రతిష్టాకరమైన ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌’ గత ఐదేళ్లలో జరిపిన పరిశోధనల ఫలితాల ప్రాతిపదికన అమెరికా ప్రొఫెసర్లు కరోనాపై ఈ అభిప్రాయలను వెలిబుచ్చారు.