Thursday, June 25, 2020

పోలవరం శరవేగం

పోలవరం శరవేగం

25 Jun, 2020

దశాబ్దాల స్వప్నం సాకారం దిశగా వడివడిగా అడుగులు

గడువులోగా పూర్తి చేయడానికి సీఎం జగన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపకల్పన

ఎప్పటికప్పుడు సమీక్షలు.. సంప్రదింపులతో డిజైన్లన్నింటికీ మోక్షం

రోజుకు సగటున స్పిల్‌ వేలో వెయ్యి, స్పిల్‌ చానల్‌లో

రెండు వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు

స్పిల్‌ వే బ్రిడ్జిని పూర్తి చేసి వరదల్లోనూ పనులు చేసేలా ఏర్పాట్లు

త్వరితగతిన కాఫర్‌ డ్యామ్‌లు.. సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్‌ పనులు

2022 జూన్‌లో ఆయకట్టుకు నీళ్లందించే దిశగా అడుగులు

అది పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతం.. భారీ క్రేన్లు.. రెడీమిక్సర్లతో సందడి సందడిగా ఉంది.. వందల కొద్దీ కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు చకచకా సాగిపోతున్నాయి. పనులు పర్యవేక్షిస్తున్న ఎస్‌ఈ నాగిరెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. స్పిల్‌ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల చొప్పున కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని, మే, 2021 నాటికి 48 గేట్లను బిగించి, స్పిల్‌వేను పూర్తి చేస్తామని చెప్పారు. ‘వరదలు తగ్గాగానే.. నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీని భర్తీ చేసి.. నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను జూలై, 2021 నాటికి పూర్తి చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించి.. 2021, డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం’ అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, పకడ్బందీ ప్రణాళిక, అకుంఠిత దీక్షకు పోలవరం ప్రాజెక్టు పనులు అద్దం పడుతున్నాయి. దశాబ్దాల స్వప్నం శరవేగంగా చేరువవుతోంది. ఇంజనీరింగ్‌ అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఉరకలెత్తే గోదారమ్మకు బ్రేకులేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 

ఎలాంటి హడావుడి లేకుండా, ప్రచారార్భాటాలకు దూరంగా.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులు చకచకా సాగుతున్నాయి. కరోనా భయపెడుతున్న వేళ సైతం కట్టుదిట్టమైన చర్యలతో రికార్డు స్థాయిలో పనులు పరుగులు పెడుతున్నాయి.

(రామగోపాలరెడ్డి ఆలమూరు) 
పోలవరం ప్రాజెక్టు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట వద్ద ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదన 1941లో బ్రిటీష్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలుగు నేల సుభిక్షమవుతుందని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారు. కానీ.. ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా 2004 వరకూ ఏ ముఖ్యమంత్రీ సాహసించలేదు. 2004లో దివంగత సీఎం వైఎస్సార్‌ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. కానీ.. వైఎస్సార్‌ హఠాన్మరణంతో పోలవరం పనులు మందగించాయి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గత ప్రభుత్వం అందిపుచ్చుకుని, ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో విఫలమైంది. కమీషన్ల కోసం జీవధార పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది. జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసి.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖాజనాకు రూ.838.51 కోట్లను ఆదా చేశారు.

టీడీపీ సర్కారు ఐదేళ్లలో రోజుకు సగటున 131.59 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించినప్పటి నుంచి రోజుకు సగటున 3,000 క్యూబిక్‌ మీటర్ల పనులు చేస్తోంది. 

ప్రణాళికాయుతంగా పనులు
► టీడీపీ సర్కార్‌ ప్రణాళిక లోపం.. అవగాహన రాహిత్యం, చిత్తశుద్ధి లేమి పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయి. పనులు గందరగోళంగా మారాయి. ఈ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021లోగా పూర్తి చేయడానికి సీఎం  జగన్‌ కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌) రచించారు. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. ఈ ప్రణాళిక అమలును సీఎం జగన్, మంత్రి అనిల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిజైన్లకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) నుంచి ఆమోదం తెచ్చారు. దాంతో పనులు చేపట్టడానికి మార్గం సుగమమైంది.

కరోనా కోరలు చాస్తున్నా నిర్విఘ్నంగా పనులు 
► గత సీజన్‌లో వరదలు తగ్గాక.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ మధ్యలో నిలిచిన నీటిని డీవాటరింగ్‌ చేసి నవంబర్‌లో పనులు ప్రారంభించారు.
► కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం లాక్‌ డౌన్‌ విధించింది. దాంతో కార్మికులు బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వారి ఊళ్లకు వెళ్లారు. సొంతూళ్లకు చేరుకున్న రెండు వేల మందికిపైగా కార్మికుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మేఘా (మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌) భరోసా కల్పించి.. ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించాయి. కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ స్పిల్‌ వేలో వెయ్యి క్యూబిక్‌ మీటర్లు.. స్పిల్‌ చానల్‌లో రెండు వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో కాంక్రీట్‌ పనులు రోజూ చేస్తున్నారు. బుధవారం వరకూ 2.77 లక్షల క్యూబిక్‌ మీటర్ల (స్పిల్‌ వేలో 1.29, స్పిల్‌ చానల్‌లో 0.98 లక్షల) పనులు చేశారు. స్పిల్‌ వేలో 2.62 లక్షలు, స్పిల్‌ చానల్‌లో 6.98 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేస్తే స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పూర్తవుతాయి. ఈ పనులు 2021 మే నాటికి పూర్తవుతాయి.
► గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టగానే ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో మిగిలిన 35.82 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను నవంబర్‌లో ప్రారంభించి.. 2021 జూలై నాటికి పూర్తి చేసేలా చేపడతారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో మిగిలిన 22.09 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను 2021 జూలై నాటికి పూర్తి చేస్తారు. గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్‌ వే మీదుగా నవంబర్‌ నుంచే మళ్లిస్తారు. 
► ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ పనులను ప్రారంభించి.. 117.69 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తారు. ఆలోగా కాలువలకు జలాశయంతో అనుసంధానం చేసే పనుల (కనెక్టివిటీస్‌)ను పూర్తి చేసి.. 2022 జూన్‌లో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించింది.

ఇది మీకు తెలుసా? 
ప్రస్తుతం ప్రపంచంలో గరిష్టంగా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలను విడుదల చేసే సామర్థ్యంతో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను చైనా నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రాగన్‌’ను తలదన్నేలా అత్యధికంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను నిర్మిస్తోంది. గోదావరి నదికి అడ్డంగా మూడు కొండల మధ్యన ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఇసుక తిన్నెలపై అతి పొడవైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ ఇదే.

పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీపై కుడి, ఎడమ కాలువల కింద 7.2 లక్షల ఎకరాలు.. గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు వెరసి 38.70 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. ప్రపంచంలో గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది.


వరదలు వచ్చినా పనులు కొనసాగించేలా ప్రణాళిక
► గోదావరి నదికి ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తేనే స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌కు వరద జలాలు చేరుతాయి. జూలై ఆఖరుకు ఆ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ పనులను కొనసాగించనున్నారు. 
► స్పిల్‌ వే పియర్స్‌ 52 మీటర్లకు పూర్తి చేసి.. వాటికి గడ్డర్లు బిగించి.. వాటిపై స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ను వేసే పనులు చేపట్టి.. నవంబర్‌ నాటికి వాటిని పూర్తి చేస్తారు. నవంబర్‌ తర్వాత స్పిల్‌ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–3 పనులు చేపడతారు. నవంబర్‌లో డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ప్రారంభించి.. 2021 డిసెంబర్‌కు పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు.

నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి 
► టీడీపీ సర్కార్‌ నిర్వాకం వల్ల గతేడాది 41.15 మీటర్ల కాంటూర్‌కు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలూ.. వరద ముప్పును ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై నాటికి 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 15,444 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సర్కార్‌ నిర్ణయించింది.
► పునరావాసం కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 45.72 మీటర్ల పరిధిలో కాంటూర్‌ 82 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. సహాయ, పునరావాసం పనులకే రూ.30 వేల కోట్లకుపైగా సర్కార్‌ వ్యయం చేస్తోంది. 

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నాం 
– మంత్రి అనిల్‌
పోలవరం ప్రాజెక్టుకు మహానేత వైఎస్సార్‌ నడుం బిగించారు. విభజన నేపథ్యంలో వంద శాతం ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. టీడీపీ సర్కార్‌ కమీషన్‌ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది.  జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పోలవరం పనుల్లో రూ.838.51 కోట్లు ఆదా చేశాం. 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించి, ఆ దిశగా చర్యలు చేపట్టాం. 2022 జూన్‌ నాటికి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా వైఎస్సార్‌ ప్రారంభించిన పోలవరాన్ని ఆయన తనయుడు సీఎం  జగన్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

పొక్లెయిన్‌తో టన్నుల కొద్దీ మట్టిని తవ్వి.. టిప్పర్లలోకి పొసి.. తరలిస్తున్నారు. మరో వైపు ఇసుక, కంకర పోస్తూ రోలర్‌తో తొక్కించి.. గట్టిపరిచి.. వాటిపై రెడీ మిక్సర్లతో తెచ్చిన కాంక్రీట్‌ను పోసి.. స్పిల్‌ వేలో బ్లాక్‌లు వేస్తున్నారు. ఒక్కో బ్లాక్‌లో వంద క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేస్తామని.. రోజుకు 20 బ్లాక్‌ల పనులు చేస్తున్నామని స్పిల్‌ చానల్‌ పనులు పర్యవేక్షిస్తున్న డీఈ శ్రీనివాసరావు చెప్పారు. స్పిల్‌ చానల్‌ను మార్చి, 2021 నాటికి పూర్తి చేస్తామని వివరించారు

Saturday, June 20, 2020

చైనా గొడవ మనతోనే కాదు..

జూన్ 20, 2020

చైనా గొడవ మనతోనే కాదు.. 

గాల్వన్‌ ఘటన.. మరోసారి భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు తెర లేపింది. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతున్న చైనా.. ఇటీవల భారత్‌లోని గాల్వన్‌ లోయలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మన జవాన్లు ప్రాణాలు అర్పించి నిలువరించారు. డ్రాగన్ చైనాకు కేవలం మన దేశంతోనే కాదు.. తన సరిహద్దు దేశాలు, సరిహద్దులో లేని దేశాలతోనూ గొడవలకు దిగుతోంది. తనది కాని భూభాగాన్ని దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో చైనా ఏయే దేశాలతో గొడవలు పడుతుందో చూద్దాం..

భారత్‌తో వైరం
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా కుతంత్రాలు చేస్తోంది. భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ వాదనకు దిగుతోంది. ఇరు దేశాల మధ్య మెక్‌మోహన్‌రేఖ, క్లెయిమ్‌ లైన్‌, వాస్తవ ఆధీన రేఖ  ఉన్నా.. వాటిని దాటి భారత్‌లోకి చొరబడుతోంది. 1914లో భారత్‌లోని బ్రిటన్‌ ప్రభుత్వం నేతృత్వంలో భారత్‌, చైనా, టిబెట్‌ మధ్య సరిహద్దులు ఏర్పాటు అయ్యాయి. అయితే దీన్ని చైనా ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ను టిబెట్‌లో భాగంగానే భావిస్తోంది. అలాగే లద్దాఖ్‌లోని అక్సాయ్‌ చిన్‌, దెమ్‌చాక్‌ ప్రాంతాన్ని, చంబూ వ్యాలీని చైనా తమదేనంటోంది. ఈ క్రమంలో భారత్‌, చైనా మధ్య యుద్ధాలు కూడా జరిగాయి.

ఐలాండ్స్‌ కోసం ఆరాటం
తూర్పు చైనా సముద్రంలో జపాన్‌ ఆధీనంలో ఉన్న కొన్ని ఐలాండ్స్‌ సమూహాన్ని కైవసం చేసుకోవాలని 1970 నుంచి చైనా యత్నిస్తోంది. జపాన్‌.. చైనా.. తైవాన్‌ మధ్యలో ఈ ఐలాండ్స్‌ ఉన్నాయి. వీటిని సెంకకు ఐలాండ్స్‌ అని జపాన్‌, డివోయూ ఐలాండ్స్‌ అని చైనా, తియాయూటై అని తైవాన్‌ పిలుస్తున్నాయి. 1945 నుంచి 1972 వరకు అమెరికా పాలనలో ఉన్న ఈ ఐలాండ్స్‌ను ప్రస్తుతం జపాన్‌ ఆధీనంలో ఉన్నాయి. అయితే 1970లో ఈ ఐలాండ్స్‌లో చమురు నిల్వలు, మత్స్య సంపద ఉన్నట్లు గుర్తించారు. సముద్ర మార్గ రవాణాకు మంచి సౌలభ్యం ఉండటంతో చైనా కన్ను ఆ ఐలాండ్స్‌పై పడింది. జపాన్‌ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ.. వాటిని ఆక్రమించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ  ఐలాండ్స్‌ తమవేనని వాదిస్తోంది. తైవాన్‌ చైనాలో భాగమైనప్పటికి అవి తమకు చెందినవేనని వాదిస్తోంది.

వియత్నాంతో కయ్యం
వియత్నాంపై కూడా చైనా తన దురాక్రమాలను ప్రదర్శించింది. ఆ దేశంలో దాదాపు 50 ప్రాంతాలను స్వాధీనం చేసుకునే యత్నం చేసింది. స్పార్ట్‌లీ ఐలాండ్స్‌ను ఆక్రమిస్తోంది. ఈ క్రమంలో చైనా-వియత్నాం మధ్య 1979 నుంచి 1991 వరకు పలుమార్లు యుద్ధాలు కూడా జరిగాయి. ఈ ఐలాండ్స్‌ తమవేనంటూ తైవాన్‌, ఫిలిప్పిన్స్‌ కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

నదీ ప్రాంతంపై నార్త్‌ కొరియాతో..
ఉత్తర కొరియా, చైనా మధ్యలో ఉన్న యాలూ నదీ.. అందులోని ఐలాండ్స్‌పై ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నదీపై సర్వహక్కులను చైనా, ఉత్తర కొరియా సమానంగా పంచుకున్నాయి.

తమవేనంటూ..
దక్షిణ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పిన్స్‌ మధ్య ఉన్న స్కార్‌బేరా మట్టి దిబ్బ విషయంలో ఇరు దేశాలు గొడవలు పడుతున్నాయి. 2012లో ఈ చిన్న మట్టి దిబ్బ వద్దకు చైనాకు చెందిన కొందరు చేపల వేటకు వెళ్లారు. ఫిలిప్పిన్స్‌ నేవీ వారిని అరెస్టు చేయబోతే చైనాకు చెందిన నేవీ వారిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి స్కార్‌బేరా చైనా నియంత్రణలో ఉంటోంది. స్పార్ట్‌లీ ఐలాండ్స్ విషయంలో ఇరు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.

కొండ కోసం దక్షిణ కొరియాతో కొరివి
యెల్లో సముద్రంలో సొకొట్రా అనే కొండ ఉంది. సముద్ర మట్టానికి 15 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండ అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికి చెందదు. కానీ దీనిని దక్కించుకోవాలని దక్షిణ కొరియా, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఈ కొండ తమ ఎకానమికల్‌ జోన్‌లోకి వస్తుందంటే కాదు.. కాదు.. మా ఎకానమికల్‌ జోన్‌లోకి వస్తుందని ఇరు దేశాలు వాదిస్తున్నాయి.

భూటాన్‌ను భయపెడుతూ
భారత్‌కు మిత్రదేశమైన భూటాన్‌లో చైనా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. టిబెట్‌లోని భూటాన్‌కు చెందిన కొన్ని ప్రాంతాలతోపాటు డొక్లాంలోనూ చొరబడేందుకు డ్రాగన్‌  ప్రయత్నిస్తోంది. 2017లో చైనా.. డొక్లాంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. దీనిని భూటాన్‌ త్రీవంగా వ్యతిరేకించింది. ఈ విషయం భారత్‌కు తెలియడంతో భారత్‌ బలగాలు డొక్లాంలో చైనా బలగాలను అడ్డుకున్నాయి. 

ఇండోనేషియా ప్రాంతంపై పట్టుకు తైవాన్‌.. చైనా 
తైవాన్‌, చైనాలో భాగమే.. అయినా దక్షిణ చైనా సముద్రంలో ఉన్న స్పార్ట్‌లీ ఐలాండ్స్‌, నాతునా ఐలాండ్స్‌ విషయంలో ఇరు దేశాలు విభేదిస్తున్నాయి. ఆయా ఐలాండ్స్‌ తమవేనంటూ వాదిస్తున్నాయి.

పామిర్‌ పర్వతాల్లో తజికిస్థాన్‌తో తగువులాట
2011లో జరిగిన ఒప్పందం ప్రకారం తజికిస్థాన్‌ పామిర్‌ పర్వతాల్లోని 1,158 స్క్వేర్‌ కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. చైనా తజికిస్థాన్‌లోని 73వేల స్క్వేర్‌ కిలోమీటర్ల ప్రాంతంపై తమ అధికారాలను వదిలేసింది. అయితే కొన్నిసార్లు పామిర్‌ పర్వత ప్రాంతంలో చైనా, తజికిస్థాన్‌ సరిహద్దు విషయంలో తజికిస్థాన్‌ ధోరణి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుండంతో ఇరు దేశాల మధ్య విభేధాలు తలెత్తుతున్నాయి.

మట్టి దిబ్బ కోసం మలేషియాతో గొడవ
దక్షిణ చైనా సముద్రంలో ఉన్న మలేషియాకు చెందిన జేమ్స్‌ మట్టిదిబ్బను కైవసం చేసుకోవడం కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతం తమ పరిధిలోనే ఉందని మలేషియా చెబుతోంది. ఇప్పటికి ఆ ప్రాంతాన్ని తమ పాలనలోనే ఉంచుకున్న మలేషియా చమురు నిలువలు ఉన్నాయోనని పరిశోధిస్తోంది. అయితే చైనాకూ జేమ్స్‌ మట్టిదిబ్బ తమదేనని వాదిస్తోంది. 1981ను నుంచి చైనాకి చెందిన నేవీ పలుమార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించిందని, చైనా మెరైన్‌ సర్విలెయన్స్‌ బృందం కూడా వెళ్లి సార్వభౌమాధికారం తమదేనని తెలిపే శిలాఫలకం కూడా ఏర్పాటు చేసిందని చెబుతోంది. 

వీటితోపాటు అఫ్గానిస్థాన్‌, మంగోలియా, కిర్జికిస్థాన్‌, కాంబోడియా, బ్రూనే, లావోస్‌ దేశాలతోనూ భూభాగం విషయంలో వైరం కొనసాగిస్తోంది. కొన్ని ప్రాంతాలు చైనా సరిహద్దుల్లో లేకున్నా.. పూర్వం చైనాకు చెందినవేనంటూ వితండవాదం వినిపిస్తోంది. 

- ఇంటర్నెట్ డెస్క్‌

Tuesday, June 16, 2020

మగవాళ్లలోనే ఎందుకు కరోనా మరణాలు ఎక్కువ?

మగవాళ్లలోనే ఎందుకు కరోనా మరణాలు ఎక్కువ?

16 Jun, 2020

మాస్ట్‌ కణాలు కారణమే
 పురుషుల్లోనే ఎందుకు ఎక్కువగా మరణిస్తున్నారు ? లేదా స్త్రీలే ఎందుకు ఎక్కువగా బతికి బయట పడుతున్నారు ? అందుకు సామాజిక, వైద్య కారణాలతోపాటు ఎక్కువగా లింగ పరంగా శారీరక నిర్మాణ వ్యవస్థలో ఉన్న తేడాలే కారణమని వైద్య పరిశోధనాంశాల ప్రాతిపదికగా స్పష్టమవుతోంది. స్త్రీ, పురుషుల రోగ నిరోధక శక్తిలో మాస్ట్‌ కణాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అంటురోగాలను ఎదుర్కోవడంలో మాస్ట్‌ కణాలు పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తాయి. మహిళలే ఎక్కువగా జలుబు, దగ్గు లాంటి అలర్జీలకు గురవుతుండడం వల్ల వారిలో మాస్ట్‌ కణాలు క్రియాశీలకంగా మారి ఉండవచ్చు. 

సెక్స్‌ హార్మోన్స్‌ పాత్ర
స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజెన్‌తోపాటు టెస్టోస్టెరోన్‌ అనే రెండు సెక్స్‌ హార్మోన్స్‌ ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌లు ఎక్కువగా ఉంటే పురుషుల్లో టెస్టోస్టెరోన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్స్‌ ఎక్కువ సంఖ్య కారణంగా స్త్రీలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. స్త్రీలలో రెండు రకాల ఎక్స్‌–క్రోమోజోమ్స్‌ ఉంటాయి. అందులో ఒక క్రోమోజోమ్‌లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన జన్యువులు స్తబ్దుగా ఉంటాయి. దాంతో మరో కోమోజోమ్‌లోని జన్యువులు మరింత క్రియాశీలకంగా పని చేస్తాయి. అదే పురుషుల్లో ఉండే ఒకే ఒక్క ఎక్స్‌–క్రోమోజోన్‌లోని జన్యువులకు అంత శక్తి లేదు. 

సామాజిక, వైద్య కారణాలు
స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా పాగ తాగడం, మద్యం సేవించడం, జబ్బును నిర్లక్ష్యం చేయడం, తద్వారా తక్షణమే వైద్య సేవలు అందుకోకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం పురుషల మరణాలకూ కారణం అవుతోంది. స్థూలకాయం, డయాబెటీస్, గుండె జబ్బుల్లో ఉన్న తేడాలు కూడా మరణాల మధ్య తేడాకు కారణం కావచ్చు. అమెరికాలోని ప్రతిష్టాకరమైన ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌’ గత ఐదేళ్లలో జరిపిన పరిశోధనల ఫలితాల ప్రాతిపదికన అమెరికా ప్రొఫెసర్లు కరోనాపై ఈ అభిప్రాయలను వెలిబుచ్చారు. 

ఒమెన్‌ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!

ఒమెన్‌ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!

16 Jun, 2020

ఒమెన్‌ నుంచి ముంబై వైపు ఈ నెల 12న బయలుదేరిన మిడతల దండు..

17న చేరుకునే అవకాశం  

దక్షిణాది రాష్ట్రాలకూ పొంచి ఉన్న మిడతల ముప్పు  

16 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం

జూన్‌ 22 – జూలై 17 మధ్యలో రాజస్థాన్‌కు భారీగా మిడతల తాకిడి

సాధారణంగా తూర్పు ఆఫ్రికా నుంచి ఇరాన్, పాకిస్తాన్‌ మీదుగా మన దేశం (రాజస్థాన్, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతం)లోకి గాలి వాటున ఎడారి మిడతల దండ్లు వస్తూ ఉంటాయి. అయితే, ఈ ఏడాది అసాధారణంగా ఎన్నో రెట్లు ఎక్కువగా మిడతలు పుట్టుకొచ్చినందున ఇప్పుడు సముద్రం వైపు నుంచి కూడా మిడతల దాడి ప్రారంభం అయ్యింది. అరేబియా మహాసముద్రం మీదుగా మిడతల దండు నేరుగా మన దేశంలో పశ్చిమ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌.ఎ.ఓ.) ఈ విషయమై కొద్ది నెలలు ముందే హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో తొలి దండు ఒమెన్‌ దేశం నుంచి జూన్‌ 12న అరేబియా మహాసముద్రం మీదుగా ఆకాశ మార్గాన భారత్‌ వైపు బయలుదేరిందని ఎఫ్‌.ఎ.ఓ. తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈ దండు ప్రయాణం సజావుగా కొనసాగితే జూన్‌ 17 నాటికి మహారాష్ట్ర సముద్ర తీరప్రాంతానికి చేరుకోవచ్చని ఎఫ్‌.ఎ.ఓ. పేర్కొంది. వాతావరణం అనుకూలించకపోతే మిడతలు సముద్రంలో పడి మరణించ వచ్చు కూడా అని తెలిపింది. 

♦ ఒమెన్‌–ముంబై మధ్య 1,566 కిలోమీటర్ల దూరం ఉంది. మిడతల దండు ఇంత దూరం ఏకబిగిన తిండీ తిప్పలు లేకుండా, అలసట లేకుండా ఎగరగలుగుతుందా? అసాధ్యం కాదని చరిత్ర చెబుతోంది.
♦ మిడతలు గంటకు 16–19 కి.మీ. ప్రయాణించగలవు. మిడతల దండ్లు 5 నుంచి 130 కి. మీ. లేదా అంతకన్నా ఎక్కువ దూరం ఎగరగలవు. మిడతల ప్రయాణ వేగం గాలుల వేగంపై ఆధారపడి ఉంటుంది.
♦ మిడతల దండు అనేక రోజుల పాటు ఆకాశంలోనే ఉండి గాలి వాటున ప్రయాణించ గలదు. ఆ సమయంలో అతి తక్కువ శక్తిని మాత్రమే ఖర్చు చేయగల ఒడుపు మిడతలకు తెలుసునట. 300 కి.మీ. వెడల్పు ఉండే ఎర్ర సముద్రాన్ని తరచూ అలవోకగా దాటేస్తుంటాయి.
♦ 1954లో వాయువ్య ఆఫ్రికా నుంచి బయలుదేరి బ్రిటన్‌ చేరుకున్నాయి. 1988లో పశ్చిమ ఆఫ్రికా నుంచి కరిబియన్‌ చేరాయి. 5 వేల కి.మీ. దూరాన్ని కేవలం పది రోజుల్లో మిడతల దండులు చేరుకున్నాయి.
♦ తూర్పు ఆఫ్రికా, ఒమెన్, ఎమెన్‌ తదితర దేశాల్లో కుప్పలు తెప్పలుగా గత 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ సంఖ్యలో మిడతలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి, అక్కడి నుంచి నేరుగా అరేబియా మహాసముద్రం మీదుగా మన దేశంలోని పశ్చిమ తీర ప్రాంతానికి మిడతల దండులు తాకే ముప్పు ఉంది. అక్కడి నుంచి గాలులు అనుకూలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై కూడా వచ్చే కొద్ది వారాల్లో మిడతలు దండుయాత్ర చెయ్యొచ్చు.
♦ అటు రాజస్థాన్‌ నుంచి కూడా ఇంతకు ముందుకన్నా ఎక్కువ సంఖ్యలో మిడతల గుంపులు దక్షిణాది వైపు రావచ్చు. ఎఫ్‌.ఎ.ఓ. ఎప్పటికప్పుడు మిడతల స్థితిగతులపై బాధిత దేశాలకు సమాచారం ఇస్తూ ఉంటుంది. జూన్‌ 22 నుంచి జూలై 19 వరకు రాజస్థాన్‌ మీదుగా మిడతల దండయాత్ర మరింత ఉధృతం కాబోతున్నదని, సర్వసన్నద్ధంగా ఉండాలని ఎఫ్‌.ఎ.ఓ. భారత ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 16 రాష్ట్రాలను హెచ్చరించినట్లు సమాచారం. మిడతల నియంత్రణకు ట్రాక్టర్లు, ఫైరింజన్లతోపాటు డ్రోన్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వేపనూనె పిచికారీ చేయాలి: స్వామినాథన్‌

♦ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ సహా పలువురు శాస్త్రవేత్తలు రైతులు రసాయనాలు పచికారీ చేయవద్దని సూచిస్తున్నారు. మిడతల రాకకు ముందు రోజుల్లో పంటలపై వేప నూనె కలిపిన నీటిని పిచికారీ చేయాలని డా. స్వామినాథన్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. వేప నూనె వాసన, రుచికి పంటలను మిడతలు తినకుండా వెళ్లి పోతాయి. అంతేకాదు, వేప నూనె పోషకంగా కూడా పంటలకు పనిచేస్తుందన్నారు.  
♦ మిడతల దండును మట్టుబెట్టేందుకు పురుగుమందులు చల్లిన ప్రాంతాల్లో విషతుల్యమైన మిడతలు చచ్చి పడి ఉంటాయి. కాబట్టి, కనీసం వారం రోజుల వరకు పశువులు, కోళ్లు అటువైపు వెళ్లి విషతుల్యమైన మిడతలను తినకుండా రైతులు జాగ్రత్తపడాలి.   
♦ ఎడారి మిడతలు దండు కట్టక ముందు బాల్య దశలో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఎగురుతాయి. పెరిగి పెద్దయి దండులో చేరిన తర్వాత పగటి పూట ఎగురుతాయి.  చెట్లు, పంటలపై వాలి రాత్రి పూట కూడా ఆకులు, కంకులు తింటూనే ఉంటాయి. రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వాల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ గండం గట్టెక్కాల్సిన సీజన్‌ ఇది.    

భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంట టెన్షన్‌

జూన్ 16, 2020

భారత్‌-చైనా సరిహద్దుల్లో 45 ఏళ్ల తర్వాత..!
ముగ్గురు భారత్‌.. ఐదుగురు చైనా సైనికుల మృతి..?
వాస్తవాధీన రేఖ వెంట టెన్షన్‌

భారత్‌ - చైనా సరిహద్దుల్లో గాల్వన్‌ లోయ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి చైనా సైనికులు చేసిన దాడిలో భారత్‌కు చెందిన ఒక కల్నల్‌తోపాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాలు బాహాబాహి తలపడిన సందర్భాలు ఉన్నా ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఓ పక్క సైనికాధికారులు చర్చలు జరుగుతుండగా.. మరోపక్క ఈ ఘటన చోటు చేసుకోవడంతో పరిస్థితి ఎటు వెళుతుందో అన్న అందోళన వ్యక్తవుతోంది. 1975లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తులుంగ్‌ లా వద్ద నలుగురు భారత సైనికులను చైనా దళాలు అకారణంగా చంపేశాయి 

అమరవీరులది 16 బిహార్‌ రెజిమెంట్‌..?
చైనా సైనికులతో సోమవారం జరిగిన ఘర్షణలో మరణించిన వారిలో 16 బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘర్షణలో కమాండింగ్‌ ఆఫీసర్‌ సహా ఒక జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గల్వాన్‌ లోయలో ఒక ప్రదేశాన్ని వీడి వెళ్లేందుకు చైనా సైనికులు నిరాకరించిన సమయంలో వాగ్వాదం జరిగింది.. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వీరు మృతి చెందినట్లు సమాచారం. చైనా వైపు కూడా ఐదుగురు సైనికులు మృతి చెందినట్లు సమాచారం. తమ సైనికులు మృతి చెందినట్లు ప్రకటన విడుదల చేసిన భారత సైన్యం.. కొద్ది సేపు ఆగి మరో ప్రకటన విడుదల చేసింది. దీనిలో చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగినట్లు పేర్కొంది. చైనా వైపు ఐదుగురు సైనికులు చనిపోయినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.  మరికొందరు గాయపడినట్లు సమాచారం. 

గల్వాన్‌లోయ రోడ్డుపై చైనా అక్కసు.. 
1962లో భారత్‌-చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గల్వాన్‌ కూడా ఒకటి. గల్వాన్‌ లోయ వద్ద భారత్‌ చెందిన బోర్డర్‌ రోడ్ ఆర్గనైజేషన్‌ ఆధ్వరంలో డర్బుక్‌-ష్యంకు- దౌలత్‌బేగ్‌ ఓల్డీ కి 255 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారిపై ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణించే వీలుంది.  ఈ మార్గం నేరుగా దౌలత్‌బేగ్‌ ఓల్డీ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కలుస్తుంది. ఈ మార్గం పూర్తయితే మన బలగాలు కేవలం అరగంటలోపు గల్వాన్‌ లోయకు చేరుకొంటాయి. గతంలో ఈ పర్వత మార్గంలో దళాల రాకకు దాదాపు 8 గంటల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మిస్తున్న రోడ్డుపై చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా గల్వాన్‌ ప్రాంతంలోకి దళాలను చొప్పించి ఆ భూభాగం కూడా తనదే అని వాదిస్తోంది. 

దౌలత్‌బేగ్‌ ఓల్డీ భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సియాచిన్‌ హిమనీనదానికి సమీపంలోనే ఉంటుంది. సియాచిన్‌ అత్యంత ఎత్తులో ఉండటంతో భారత్‌కు చైనా-పాక్‌ మధ్య ఉన్న కారాకోరం హైవేపై నిఘా వేయడానికి అత్యంత అనువుగా ఉంటుంది. దీంతోపాటు ఆక్సాయ్‌చిన్‌లో చైనా కదలికలను ఇక్కడి నుంచి కనిపెట్టవచ్చు. ఇది షిన్‌జియాంగ్‌-టిబెట్‌ రహదారికి కొంత దూరం సమాంతరంగా ఉంటుంది. 

1962 చైనాతో యుద్ధం సందర్భంగా ఈ ఎయిర్‌ స్ట్రిప్‌ను నిర్మించారు. ఆ తర్వాత దీనిని 2008 వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత వాయుసేన ఎల్‌ఏసీ వెంట తన పలు ల్యాండింగ్‌ గ్రౌండ్స్‌ను ఆధునీకరించడంలో భాగంగా అభివృద్ధి చేసింది. 2013లో సీ130 గ్లోబ్‌ మాస్టర్‌ను ఇక్కడ ల్యాండ్‌ చేసి రికార్డు సృష్టించింది. సరిహద్దులకు నిత్యావసరాలు సరఫరా చేసే  హెలీకాప్టర్లు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి. 


Sunday, June 7, 2020

అయోధ్య రామ మందిరం




అలా మొదలైంది రామ మందిరం
అయోధ్య రామ మందిరం



త్రేతాయుగం. సరయూ నది ఒడ్డున... అయోధ్య నగరంలో... చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో దశరథమహారాజు, కౌసల్యాదేవి దంపతులకు రాముడు పుట్టాడు.
కలియుగం. యమునా నది ఒడ్డున... దిల్లీ మహానగరంలో... 2019 నవంబరు 9న... దేశ అత్యున్నత న్యాయస్థానంలో రాముడు గెలిచాడు.

లోక కల్యాణం కోసం తాను తలపెట్టిన యజ్ఞానికి రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారనీ, వాళ్ల ఆటలు కట్టించడానికి రాముడిని తన వెంట పంపమనీ విశ్వామిత్రుడు అడిగినప్పుడు ఆ తండ్రి దశరథుడికి ఎంత కష్టం కలిగిందో- తమ రాముడి పరిస్థితి చూసి నిన్నమొన్నటి దాకా అయోధ్యావాసులకూ అంతే కష్టం కలిగింది. రాముడి గుడి లేని ఊరు ఊరే కాదు అనుకునే దేశంలో... అదీ జగదానందకారకుడి జన్మస్థలమైన అయోధ్యలో... రాముడికి గుడి లేదనే వారి బాధకి ఎట్టకేలకు తెరపడింది.

వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామజన్మభూమి నిస్సందేహంగా ‘రామ్‌లల్లా విరాజ్‌మాన్‌(కొలువుదీరిన చిన్నారి రాముడు)’దేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ తీర్పు దేశంలోని రామభక్తులందరినీ ఆనందంలో ముంచెత్తింది. రాముడు పుట్టిన చోటే ఆ రాముడికి ఓ అందమైన గుడి కడితే అందులో కొలువైన దేవుడిని చూసి తరించాలనుకుంటున్నవారి కలలు పండే రోజు ఇక ఎంతో దూరం లేదు. అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో మందిర నిర్మాణం మొదలైంది. అపూర్వమైన శిల్పకళతో ‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో ఓ అద్భుతమైన దేవాలయం రూపుదిద్దుకోబోతోంది.

డెబ్బై ఏళ్ల క్రితం
వందల, వేల ఏళ్ల చరిత్ర సంగతి పక్కన పెడదాం. దశాబ్దాల క్రితం వరకూ అయితే అక్కడ ఓ మసీదు ఉండేది. అది రామజన్మభూమి కాబట్టి ఆ స్థానంలో మందిరం కట్టాలన్న ఉద్యమం ఎప్పుడో నూట యాభై ఏళ్ల క్రితమే మొదలైంది. దాంతో దాన్ని వివాదాస్పద స్థలంగా ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. అలా ఉండగా 1949లో ఊహించని ఓ సంఘటన జరిగింది. గోరఖ్‌నాథ్‌ మఠానికి చెందిన సంత్‌ దిగ్విజయ్‌నాథ్‌ అఖిల భారతీయ రామాయణ మహాసభతో కలిసి తొమ్మిది రోజులపాటు రామ చరిత మానస్‌ పారాయణం చేశారు. సరిగ్గా అది ముగిసిన మర్నాడే- అంటే డిసెంబరు 22న వివాదాస్పద కట్టడంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు వెలిశాయి. కాపలా ఉన్న పోలీసు వారిస్తున్నా వినకుండా కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి వేళ గేటు బలవంతంగా తెరిచి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టారని కథనం. పెట్టినవారెవరో ఎవరికీ తెలియదన్నారు. ఆ విగ్రహాలను తొలగించాలంటూ కొందరూ, కాదు అక్కడ మందిరం కట్టించాలనీ విగ్రహాలకు పూజ చేసుకోడానికి అనుమతి ఇవ్వాలనీ కొందరూ... కోర్టులో కేసుల మీద కేసులు వేశారు. ప్రభుత్వం ఆ ప్రదేశానికి తాళాలు వేసింది. తర్వాత కొంతకాలానికి ఆ దేవుళ్ల విగ్రహాలకు నిత్యపూజలు చేసుకోవడానికి మాత్రం పూజారులను అనుమతించింది. అలా రామజన్మభూమిలోకి రాముడు చేరుకున్నా, ఆ రాముడికి పూజలు అందుతున్నా... ఓ ఆలయంగా భక్తులు చూసుకునే భాగ్యం మాత్రం కలగలేదు.

ఇరవై ఏడేళ్లుగా టెంటులోనే...
1992 డిసెంబరు 6 సంఘటన తర్వాత రాముల వారి విగ్రహాలను వివాదాస్పద స్థలం నుంచి తీసి పక్కనే ఒక టెంటు కింద ఏర్పాటుచేసిన వేదిక మీద ఉంచారు. పూజాదికాల నిర్వహణకు సిబ్బందిని నియమించి, భక్తులు సందర్శించుకునేందుకు అనుమతించారు. అయితే పటిష్ఠమైన బందోబస్తు ఉండేది. భక్తులను ఒక్కొక్కరినే నాలుగు దశల్లో తనిఖీలు చేసిగానీ పంపించేవారు కాదు. ఆ తనిఖీలన్నిటినీ దాటుకుని దేవుడి ముందుకు వెళ్తే కేవలం కొద్ది సెకన్లు మాత్రమే దర్శనభాగ్యం కలిగేది. ఖాళీ చేతులతో వెళ్లి దండం పెట్టుకుని వచ్చేయాల్సి రావటంతో భక్తులకు తీవ్ర అసంతృప్తిగా ఉండేది. విషయం న్యాయస్థానంలో ఉండటంతో విస్తృతమైన ఏర్పాట్లు చేసుకోడానికిగానీ వేడుకలకుగానీ ఎక్కువ డబ్బు ఖర్చు చేసే వెసులుబాటు ఉండేది కాదు. ఆ టెంటును కూడా పదేళ్లకోసారి మార్చేవారు. ఏడాదికోసారి శ్రీరామనవమి సందర్భంగా విగ్రహాలకు నూతన వస్త్రాలను మాత్రం సమకూర్చేవారు.

డబ్బు లేక కాదు...
‘రామ్‌లల్లా విరాజ్‌మాన్‌’ పేరున అయోధ్యలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతా ఉంది. 2005-06లో ఆ ఖాతాలో రూ. ఏడు లక్షలు మాత్రమే ఉండగా 2013 కల్లా అది రూ.2.7 కోట్లు అయింది. అంటే రామచంద్రుడి ఆదాయం ఏడేళ్లలో 40 రెట్లు పెరిగిందన్న మాట. 1995 వరకూ రామ మందిరానికి వచ్చిన విరాళాలను ప్రభుత్వం అయోధ్యలోని ఇతర దేవాలయాల నిర్వహణకు మళ్లించేది. ఆ తర్వాతే రాముడి పేర ప్రత్యేక ఖాతాని తెరిచారు. అందులోని డబ్బుని ఆలయ నిర్వహణకూ, పూజారి, ఇతర సిబ్బంది జీతభత్యాలకూ వాడటం మొదలెట్టారు. ఇతర దేవాలయాలతో పోలిస్తే ఇది చిన్న మొత్తమే అయినప్పటికీ గత పదేళ్లుగా విరాళాలు క్రమేణా పెరుగుతూ వచ్చాయి.

రాముడే యజమాని
దశాబ్దాల పాటు సాగిన రామజన్మభూమి వివాదంలో ఎన్నో వింతలూ విశేషాలూ చోటుచేసుకున్నాయి. వివాదాస్పద స్థలం మాకు చెందాలంటే కాదు మాకు చెందాలని పోరాడిన మూడు పక్షాలనూ కాదని ఆ స్థలం సొంతదారు రాముడేనని స్పష్టం చేసింది న్యాయస్థానం. రాముడి తరఫున ఓ సంరక్షకుడిని నియమించాలనీ, దేవాలయ నిర్మాణాన్ని స్వతంత్ర ట్రస్టుకి అప్పజెప్పాలనీ సూచించింది. దాంతో రాముడి తరఫున కోర్టులో కేసు వాదించిన కేశవ అయ్యంగార్‌ పరాశరన్‌నే సంరక్షకుడిగా నియమించింది ప్రభుత్వం. ‘శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ పేరుతో పదిహేను మంది సభ్యులతో గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్వతంత్ర ట్రస్టుకి కూడా నాయకత్వం వహిస్తున్నారు 92 ఏళ్ల పరాశరన్‌. రామ మందిర నిర్మాణ బాధ్యత అంతా ఇప్పుడీ ట్రస్టుదే. మహంత్‌ నృత్యగోపాల్‌దాస్‌ ట్రస్టు అధ్యక్షులుగా ఉన్నారు. కోర్టు అప్పజెప్పిన 2.77 ఎకరాలకు తోడు 1990ల్లోనే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమితో కలిపి మొత్తం 67.703 ఎకరాలను ప్రభుత్వం ఈ ట్రస్టుకు బదిలీ చేసింది.

విరాళాలతో నిర్మాణం
గతంలో గుజరాత్‌లోని సోమనాథ్‌ మందిర పునర్నిర్మాణాన్ని అచ్చంగా విరాళాలతో చేపట్టినట్టు ఇప్పుడు అయోధ్య రామమందిరాన్ని కూడా అలాగే కట్టాలని నిర్ణయించారు. అందుకోసం మరో ప్రత్యేక ఖాతా తెరిచారు. తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్‌ సెక్రెటరీ ఒక రూపాయి విరాళాన్ని ఇచ్చారు. తర్వాత లాక్‌డౌన్‌ ఉన్న గత రెండు నెలల్లోనే ఈ ఖాతాకు రూ. 4.60 కోట్ల విరాళాలు వచ్చాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక విరాళాలు మరింత ఎక్కువగా రావచ్చని భావిస్తున్నారు. డబ్బు ఎంత ఉంది అని చూసుకోకుండా అనుకున్న ప్రణాళిక ప్రకారం తాము మందిర నిర్మాణం చేస్తూ పోవాలనీ, అవసరానికి డబ్బు దానంతటదే సమకూరుతుందనీ ట్రస్టు భావిస్తోంది. ఆలయ నిర్మాణానికి ఎవరైనా ఏ రూపంలోనైనా విరాళాలను ఇవ్వవచ్చనీ, శ్రమదానం చేయవచ్చనీ ట్రస్టు సభ్యులు చెబుతున్నారు.

నిజానికి శ్రీరామనవమి లేదా అక్షయతృతీయ రోజున మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ అందుకు అడ్డురావడంతో మే చివరి వారంలో ప్రారంభించారు. పనులు మొదలుపెట్టడానికి ముందుగానే మార్చి 25న టెంట్‌లోని దేవాలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలను మానస్‌ భవన్‌ ఆవరణలో కట్టిన మరో తాత్కాలిక దేవాలయంలోకి పల్లకీలో వేడుకగా తరలించారు. మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌, మహంత్‌ పరమహంస్‌ దాస్‌ తదితరుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేసి మందిర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మే రెండో వారంలోనే భూమిని చదునుచేసి, శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ క్రమంలో జరిగిన తవ్వకాల్లో ఐదడుగుల శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కివున్న స్తంభాలు, ఎర్రరాతి ఇసుక ధ్వజాలు, కలశం, రాతి పుష్పాల లాంటివి బయటపడ్డాయి. ఇవన్నీ పురాతన ఆలయానికి సంబంధించినవేనని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. తవ్వకాల్లో బయటపడినవాటినన్నిటినీ భద్రం చేసి భవిష్యత్తులో ఏర్పాటుచేయబోయే మ్యూజియంలో ఉంచబోతున్నారు.

గుడి ఎలా ఉంటుందంటే...
ఇక, ఇక్కడ కట్టబోయే గుడి ఇవాళ కొత్తగా రూపకల్పన చేసింది కాదు. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో 1989లో ప్రముఖ శిల్పి చంద్రకాంత్‌ సోంపురా ఈ ఆలయ డిజైన్ని రూపొందించారు. సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రభాకర్‌ సోంపురా కొడుకైన చంద్రకాంత్‌ 130కి పైగా దేవాలయాలకు వాస్తుశిల్పిగా వ్యవహరించారు. 1984లోనే రామమందిరానికి శంకుస్థాపన చేసింది రామజన్మభూమి న్యాస్‌ సంస్థ. అప్పుడు ప్రజలు రూపాయి, రెండు రూపాయలు చొప్పున ఇచ్చిన విరాళాలే రూ.8 కోట్లు కాగా, కరసేవకపురంలో 150 మంది శిల్పులు, వందలాది కార్మికులతో పనులు కూడా ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు పనిచేశాక స్థలవివాదం ఎటూ తేలకపోవడంతో వారంతా ఎవరి ఊళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.

ఆనాటి ఆలయ డిజైనుకే ఇప్పుడు ఆకృతిని ఇవ్వబోతున్నారు. మొత్తం 67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఆలయంలో గుడి శిఖరం నేల మీది నుంచి 128 అడుగుల ఎత్తు ఉంటుంది. దేవాలయం కొలతలు 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు... ఉంటాయి. రెండంతస్తుల ఆలయంలో ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ఒక్కో స్తంభం మీద దేవీ దేవతల విగ్రహాలు పదహారు చొప్పున చెక్కి ఉంటాయి. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించేందుకూ అవకాశం ఉందని ట్రస్టు పేర్కొంది. ఆలయం పైకప్పునకు మొత్తం రాతి స్లాబ్స్‌నే వాడబోతున్నారు. సిమెంట్‌ కానీ ఇనుము కానీ వాడకుండా అంత పెద్ద ఆలయానికి స్లాబ్‌ వేయడం విశేషమే.

చాలామటుకు ఉత్తరాది వైష్ణవ దేవాలయాలు ఉండే ‘నగర’ శైలిలో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం దేవాలయమంతా ఒక విశాలమైన, ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది. దాని మీదికి వెళ్లడానికి మెట్లుంటాయి. దక్షిణాది గుడులలో లాగా పెద్ద పెద్ద ప్రహరీగోడలూ ద్వారాలూ ఉండవు. కుషాణుల పాలన చివరలో, గుప్తుల పాలన మొదట్లో ఇలాంటి దేవాలయాలను కట్టినట్లు చరిత్ర చెబుతోంది.

సగం పని అయిపోయినట్లే...
అధికారికంగా నిర్మాణం ఇప్పుడే మొదలెట్టినా నిజానికి సగం పని అయిపోయినట్లే చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ నేత ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన రథయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా సేకరించిన ఇటుకలు మందిరం గోడల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక కరసేవకపురంలో రామజన్మభూమి న్యాస్‌ సంస్థ వర్క్‌షాపులో శిల్పులు చెక్కి వరసగా ఒక పద్ధతి ప్రకారం నంబర్లు వేసి పెట్టిన స్తంభాలు, శిల్పాలు, పైకప్పుకు అతికించాల్సిన పువ్వులు లాంటివన్నీ చాలావరకూ సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి పని  మొదలైతే ఇక్కడ సిద్ధంగా ఉన్నవాటినన్నిటినీ తీసుకెళ్లి డిజైన్‌కి అనుగుణంగా వాటి వాటి స్థానాల్లో పెట్టి వైట్‌ సిమెంటుతో అతికించడమే ఉంటుంది. కాబట్టి మందిర నిర్మాణం త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉంది. ఎప్పుడో 1990ల్లోనే చెక్కి పెట్టిన గులాబి రంగు శాండ్‌స్టోన్‌ స్తంభాలను మరోసారి పాలిష్‌ చేస్తున్నారు. కలపతోనూ, పాలరాయితోనూ చెక్కిన గుడి నమూనాలు ఈ ఆవరణలో ఇప్పటికే సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

ఏమేం ఉంటాయంటే...
విశాల ప్రాంగణంలో రూపొందుతున్న రామ మందిరమే కాదు, మందిరం కేంద్రంగా ఏర్పాటుచేసే పలు నిర్మాణాలనూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దబోతున్నారు. గర్భగుడిలో బాలరాముడికి (రామ్‌లల్లా) ప్రత్యేక సింహాసనం ఉంటుంది. ప్రధాన ఆలయంతోపాటు సీతమ్మవారి వంటిల్లు(సీతారాముల వివాహానంతరం గృహిణిగా సీత మొదటిసారి అక్కడే వంటచేశారని చెప్పుకుంటారు), సీతాకూప్‌ (వారి కుటుంబం నీటిని వాడుకున్న బావి), రామ్‌ చబూత్రా (రాముడు పుట్టిన స్థలం ఇదేనంటారు), శేషావతార్‌ మందిర్‌... తదితరాలు ఉంటాయి. సందర్శకులు బస చేయడానికి ధర్మశాల, భజన గృహం, సాంస్కృతిక కార్యక్రమాలకు రంగమండపం... లాంటివి కూడా నిర్మించబోతున్నారు. రెండు వందల యాభై మంది శిల్పులు నిరంతరాయంగా పని చేస్తే గుడి నిర్మాణం పూర్తవడానికి అయిదేళ్లు పట్టవచ్చని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు మళ్లీ ఇళ్లకు వెళ్లిన శిల్పులందర్నీ తిరిగి రప్పిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి శిలలను తెచ్చి మరికొన్ని స్తంభాలను చెక్కాలి. పాలరాయితో చౌకత్‌లను నిర్మించాలి. కీలకమైన ఆలయ శిఖరనిర్మాణం చేపట్టాలి. ఇవి అన్నీ కూడా రెండేళ్లలో పూర్తిచేయాలన్నది ఇప్పటి లక్ష్యం.

ఎన్ని ప్రత్యేకతలో!
రామమందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు జరపడానికీ, భక్తులు దర్శించుకోడానికీ వీలుగా ఒక తాత్కాలిక మందిరాన్ని రామజన్మభూమి ప్రాంగణంలోనే ఉన్న మానస్‌భవన్‌లో ఒక పక్కన బులెట్‌ ప్రూఫ్‌ ఫైబర్‌తో నిర్మించారు. తాత్కాలికమే అయినప్పటికీ ఎన్నో ప్రత్యేకతలతో దీన్ని తీర్చిదిద్దారు. ఘాజియాబాద్‌కి చెందిన నేచర్‌ హోమ్స్‌ అనే సంస్థ జర్మనీ, ఎస్తోనియాల నుంచి దిగుమతి చేసుకున్న పైన్‌ చెక్కతో కేవలం ఎనిమిది రోజుల్లో ఈ మందిరాన్ని నిర్మించింది. ఆలయనిర్మాణానికి సంబంధించిన వాస్తు నియమాలన్నిటినీ అనుసరిస్తూనే మరో పక్క భూకంపాలూ తుపానులూ వరదలూ లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా తట్టుకునేలా ఈ తాత్కాలిక ఆలయాన్ని తీర్చిదిద్దారు. 1992కి ముందు ఆలయంలో కలపతో చేసిన సింహాసనం మీద రాముడి విగ్రహం ఉండేది. ఆ తర్వాత ట్రస్టు సభ్యులొకరు వెండి సింహాసనాన్ని చేయించారు. విగ్రహంతో సహా దాని బరువు దాదాపు తొమ్మిదిన్నర కిలోలు ఉంటుంది. మందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ అయోధ్యను సందర్శించే భక్తులకు సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడు ఇక్కడే దర్శనమివ్వనున్నాడు. మందిర నిర్మాణం పూర్తయి... కొత్త ఆలయంలో శ్రీరాముడు సపరివారంగా కొలువయ్యాక... అప్పుడు ‘రామన్న రాముడూ కోదండ రాముడూ శ్రీరామచంద్రుడూ వచ్చాడురా...సీతమ్మ తల్లితో వచ్చాడురా...’ అని అయోధ్యావాసులతో పాటు మనమూ గొంతు కలిపి పాడుకోవచ్చన్నమాట.

అయోధ్యకి పూర్వవైభవం
నాటి అయోధ్య కోసల సామ్రాజ్యానికి రాజధాని. నేటి అయోధ్య నిన్నమొన్నటి వరకూ ఒక చిన్న పట్టణం మాత్రమే. ఇప్పుడు మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలూ మారబోతున్నాయి. ఒకప్పుడు దేశంలోని ఏడు ప్రధాన తీర్థయాత్రాస్థలాల్లో(సప్తపురాలు) ఒకటిగా పేరొందిన అయోధ్యకి తిరిగి ఆ వైభవం తెచ్చి ‘నవ్య అయోధ్య’గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేపట్టింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. రామమందిర సందర్శనకు వచ్చే పర్యటకుల తాకిడిని తట్టుకునేలా అయోధ్యలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టింది. ఫైజాబాద్‌ జిల్లాలో ఓ భాగంగా ఉన్న అయోధ్యను ఇప్పటికే ప్రత్యేక జిల్లాగా ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణానికి రూ. 500 కోట్లు, రహదారుల అభివృద్ధికి మరో 85 కోట్లు కేటాయించింది. పర్యటకుల్ని ఆకర్షించేందుకు రూ. 2500 కోట్లు ఖర్చుపెట్టి సరయూ నది ఒడ్డున 151 మీటర్ల ఎత్తైన భారీ రామ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కూడా యూపీ ప్రభుత్వం తలపెట్టింది. అందుకు గానూ స్థల సేకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి.