జూన్ 16, 2020
భారత్-చైనా సరిహద్దుల్లో 45 ఏళ్ల తర్వాత..!
ముగ్గురు భారత్.. ఐదుగురు చైనా సైనికుల మృతి..?
వాస్తవాధీన రేఖ వెంట టెన్షన్
భారత్ - చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి చైనా సైనికులు చేసిన దాడిలో భారత్‌కు చెందిన ఒక కల్నల్‌తోపాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాలు బాహాబాహి తలపడిన సందర్భాలు ఉన్నా ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. ఓ పక్క సైనికాధికారులు చర్చలు జరుగుతుండగా.. మరోపక్క ఈ ఘటన చోటు చేసుకోవడంతో పరిస్థితి ఎటు వెళుతుందో అన్న అందోళన వ్యక్తవుతోంది. 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా వద్ద నలుగురు భారత సైనికులను చైనా దళాలు అకారణంగా చంపేశాయి
అమరవీరులది 16 బిహార్ రెజిమెంట్..?
చైనా సైనికులతో సోమవారం జరిగిన ఘర్షణలో మరణించిన వారిలో 16 బిహార్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘర్షణలో కమాండింగ్ ఆఫీసర్ సహా ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గల్వాన్ లోయలో ఒక ప్రదేశాన్ని వీడి వెళ్లేందుకు చైనా సైనికులు నిరాకరించిన సమయంలో వాగ్వాదం జరిగింది.. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వీరు మృతి చెందినట్లు సమాచారం. చైనా వైపు కూడా ఐదుగురు సైనికులు మృతి చెందినట్లు సమాచారం. తమ సైనికులు మృతి చెందినట్లు ప్రకటన విడుదల చేసిన భారత సైన్యం.. కొద్ది సేపు ఆగి మరో ప్రకటన విడుదల చేసింది. దీనిలో చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగినట్లు పేర్కొంది. చైనా వైపు ఐదుగురు సైనికులు చనిపోయినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. మరికొందరు గాయపడినట్లు సమాచారం.
గల్వాన్‌లోయ రోడ్డుపై చైనా అక్కసు..
1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గల్వాన్ కూడా ఒకటి. గల్వాన్ లోయ వద్ద భారత్ చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వరంలో డర్బుక్-ష్యంకు- దౌలత్‌బేగ్ ఓల్డీ కి 255 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారిపై ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణించే వీలుంది. ఈ మార్గం నేరుగా దౌలత్‌బేగ్ ఓల్డీ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కలుస్తుంది. ఈ మార్గం పూర్తయితే మన బలగాలు కేవలం అరగంటలోపు గల్వాన్ లోయకు చేరుకొంటాయి. గతంలో ఈ పర్వత మార్గంలో దళాల రాకకు దాదాపు 8 గంటల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మిస్తున్న రోడ్డుపై చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా గల్వాన్ ప్రాంతంలోకి దళాలను చొప్పించి ఆ భూభాగం కూడా తనదే అని వాదిస్తోంది.
దౌలత్‌బేగ్ ఓల్డీ భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సియాచిన్ హిమనీనదానికి సమీపంలోనే ఉంటుంది. సియాచిన్ అత్యంత ఎత్తులో ఉండటంతో భారత్‌కు చైనా-పాక్ మధ్య ఉన్న కారాకోరం హైవేపై నిఘా వేయడానికి అత్యంత అనువుగా ఉంటుంది. దీంతోపాటు ఆక్సాయ్‌చిన్‌లో చైనా కదలికలను ఇక్కడి నుంచి కనిపెట్టవచ్చు. ఇది షిన్‌జియాంగ్-టిబెట్ రహదారికి కొంత దూరం సమాంతరంగా ఉంటుంది.
1962 చైనాతో యుద్ధం సందర్భంగా ఈ ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించారు. ఆ తర్వాత దీనిని 2008 వరకు పట్టించుకోలేదు. ఆ తర్వాత వాయుసేన ఎల్‌ఏసీ వెంట తన పలు ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను ఆధునీకరించడంలో భాగంగా అభివృద్ధి చేసింది. 2013లో సీ130 గ్లోబ్ మాస్టర్‌ను ఇక్కడ ల్యాండ్ చేసి రికార్డు సృష్టించింది. సరిహద్దులకు నిత్యావసరాలు సరఫరా చేసే హెలీకాప్టర్లు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి.