Wednesday, July 1, 2020

చైనా క్యాబేజీ వ్యూహం..!


చైనా క్యాబేజీ వ్యూహం..!

 పక్కలో పాము.. పక్కన చైనా ఒకటే..!

 సలామీ స్లైసింగ్‌తో పొరుగు భూభాగాల భక్షణ


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా మార్చినన్ని సార్లు మ్యాప్‌ను మరే దేశం మార్చలేదంటే అంతిశయోక్తికాదేమో.  దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల ఇతర దేశాల భూభాగాల్ని ఆక్రమించిన ఘనత కూడా డ్రాగన్‌కే దక్కుతుంది. ఎప్పటికప్పుడు కొత్తపాట పాడుతూ.. పొరుగు దేశాలతో పేచీలకు దిగడం ఎంతో కొంత భూభాగాన్ని దిగమింగడం డ్రాగన్‌కు అలావాటుగా మారిపోయింది.  అదే సమయంలో యుద్ధాలు వచ్చే స్థాయిలో అక్రమణలకు దిగే ధైర్యం చేయదు. చిన్ని..చిన్న భూభాగాలను మెల్లగా తినేస్తుంది. సైనిక పరిభాషలో దీనిని ‘సలామీ స్లైసింగ్’ అంటారు. 2017లో నాటి ఆర్మీ చీఫ్‌.. నేటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ఈ విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేశారు కూడా.

అసలు సలామీ స్లైసింగ్‌ అంటే ఏమిటీ..?

1940 హంగేరియన్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాథ్యూరకోసీ ఈ పదాన్ని వాడాడు. ఎదుట పార్టీలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట. దీనిని ‘క్యాబేజీ వ్యూహం’ అని కూడా  అంటారు. పొరుగు దేశాల్లోని చిన్ని చిన్న ప్రాంతాలు తమవని చెప్పుకొని వాటిని మెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం. మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైన ఉండొచ్చు. పొరుగు దేశం అభ్యంతరం చెబితే శాంతి చర్చలపేరుతో విదేశాంగశాఖ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది. అంతేగానీ, భూభాగాలు వెనక్కి రావు. కిలోమీటర్‌ కోసమో.. కొన్ని వందల మీటర్ల భూభాగం కోసమో పొరుగు దేశాలు యుద్ధానికి దిగవు. చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను దక్కించుకొంటోంది.

గల్వాన్‌ లోయా.. పాంగాంగ్‌ సో సరస్సు కూడా ఇలానే..

భారత్‌లోని గల్వాన్ లోయ, పాంగాంగ్‌ సో సర్సుల వద్ద కూడా చైనా ఇదే వ్యూహాన్ని అమలు  చేయాలని చూస్తోంది. పాంగాంగ్‌ సోలోని ఫింగర్‌ 4 తమదే అని కొత్త వాదన అందుకొంది. వాస్తవానికి చైనా ఫింగర్ 8 వద్దే ఉండాలి. భారత్‌ ఫింగర్ 4 వరకు ఉండాలి. కానీ, ఫింగర్‌ 4 వద్ద వరకు వచ్చేందుకు భౌగోళికంగా అనుకూలంగా ఉండంతో  చైనా దానిని వాడుకొని అక్కడకు వచ్చేసింది. భారత్‌ వైపు నుంచి ఫింగర్ 4 శిఖరానికి చేరడానికి నిట్టనిలువునా కొండ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చైనా ఫింగర్‌ 4తనదే అనే వాదన తెరపైకి తెచ్చింది. ఇక గల్వాన్‌ లోయ గతంలో ఎప్పుడూ వివాదాస్పదంకాలేదు. అది పూర్తిగా భారత్‌ స్వాధీనంలోనే ఉంది. కానీ, భారత్‌ దౌలత్‌ బేగ్‌ ఓల్డీకు రహదారి నిర్మాణం చేపట్టడంతో ఇప్పుడు గల్వాన్‌ లోయ కూడా తనదే అనే వాదన తెచ్చింది.  గతంలో డోక్లాం కూడలి వద్ద కూడా ఇలాంటి సలామీ స్లైసింగ్‌కే ప్రయత్నించింది. కానీ, అప్పట్లో భారత్‌ గట్టిగా నిలబడటంతో తాత్కాలికంగా వెనుదిరిగింది.
అరుణాచల్‌ ప్రదేశ్‌, లద్దాక్‌ వంటి ప్రాంతాల్లో అప్పుడప్పుడు సలామీ స్లైసింగ్‌కు పాల్పడుతూనే ఉంటోంది. 2013లో భారత్‌ 600 చదరపు కిలోమీటర్లను చైనాకు కోల్పోయిందని శ్యామ్‌శరణ్‌ నివేదిక వెల్లడించింది. ఆ భూభాగాన్ని చైనా సలామీ స్లైసింగ్‌ రూపంలోనే ఆక్రమించింది. 

నమ్మిన నేపాల్‌ గొంతు కోస్తూ..

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధికారం నిలుపుకోవడం కోసం చైనాతో కుమ్మకై భారత్‌తో సరిహద్దు వివాదానికి కాలు దువ్వింది. ఇది జరిగి రోజులు గడవక ముందే నేపాల్‌కు చెందిన నాలుగు జిల్లాల్లో దాదాపు 28హెక్టార్ల వ్యూహాత్మక ప్రాంతాన్ని చైనా బలగాలు ఆక్రమించినట్లు ఆ దేశ ఏజెన్సీలే ప్రకటించాయి. అసలు నేపాల్‌, భూటాన్‌లే తమ టిబెట్‌లోని అంతర్భాగాలని చైనా ప్రకటించింది. 1962 తర్వాత ప్రఖ్యాత గోర్‌ఖా జిల్లాలోని ఓ గ్రామాన్ని కబ్జా చేసింది. ఈ విషయం అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా అక్కడ 34, 35, 36, 37, 38 పిల్లర్లను మార్చేసింది. ఈ విషయంపై నేపాల్‌ ప్రభుత్వం కిమ్మనలేదు.  అసలు 2019 వరకు ఏ ప్రభుత్వ అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు.  ఇప్పుడు భారత్‌తో విరోధం పెట్టుకోవడంతో చైనాను ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. 

మరికొన్ని ప్రదేశాల్లో..

దక్షిణ చైనా సముద్రంలో దీవులను ఇలానే ఆక్రమించింది. 1974లో పరాసల్‌ ద్వీపం, 1988లో జాన్సన్‌ రీఫ్‌, 1995లో మిస్‌చెఫ్‌ రీఫ్‌, 2012లో షోల్‌ ఇలా చెప్పుకొంటూ చాలా ఉన్నాయి. కేవలం భారత్‌ మాత్రమే చైనా సలామీ స్లైస్‌ను కొంత బలంగా అడ్డుకొంది. ఇటీవల గల్వాన్ లోయలో చైనా సైనికులకు బలంగా బుద్ధిచెప్పడంతో మళ్లీ చర్చలు అంటూ కొత్తరాగం అందుకొంది. 

 galwan valley

లద్దాఖ్‌ దిశగా బాహుబలులు

లద్దాఖ్‌ దిశగా బాహుబలులు

 పుట్టలో నుంచి వచ్చే చెదలు మాదిరిగా  చైనా సైనికులు భారత సరిహద్దులకు చేరుతున్నారు. మరోపక్క ఆ దేశ విదేశాంగశాఖ చర్చల పేరుతో భారత్‌ను ఆపుతోంది. మన ప్రభుత్వానికి పరిస్థితి అర్థమైంది. చర్చల కాలహరణ భారత్‌కు ప్రమాదకరమని గ్రహించింది. అత్యంత వేగంగా సరిహద్దులకు శతఘ్నులు, యుద్ధట్యాంకులను తరలించడమే తరోణాపాయమని భావించింది. అంతే, వాయుసేనలోని బాహుబలులు, భారీ కాయులు రంగంలోకి దిగారు. భారత్‌కు చెందిన వ్యూహాత్మక ఆయుధాలను సరిహద్దులకు చేర్చారు. భారత్‌ అంత వేగంగా మోహరించగలదని చైనా కూడా అంచనా వేయలేకపోయింది.  

అరుదైన వైమానిక సంపద మన సొంతం..

భారత్‌ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు, భారీ యుద్ధశకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలించవచ్చు. వీటిల్లో సీ17 గ్లోబ్‌మాస్టర్‌, సీ 130 సూపర్‌ హెర్క్యూలెస్‌, సీహెచ్‌ 47 షినూక్‌, ఎంఐ17 హెలికాప్టర్లు వంటివి రంగంలోకి దిగాయి.  1980 వరకు భారత్‌ వద్ద ఐఎల్‌76, ఏఎన్‌32 వంటివి ఉండేవి.  ప్రస్తుతం వీటితోపాటు కొన్నేళ్లుగా అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు. 

టీ-90లే కీలకం..

భారత అమ్ముల పొదిలో టి-90 అత్యంత శక్తివంతమైన ట్యాంక్‌. దీనిని సరిహద్దులకు తరలించడంతో మన బలగాలకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లే.  దీని బరువు దాదాపు 46టన్నులకు పైగా ఉంది. గతంలో ఐఎల్‌ 76 విమానం అత్యధికంగా 45 టన్నులు మాత్రమే మోయగలదు. దీంతో సీ17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాలు ఈ ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషించనున్నాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోయగలవు. అత్యధిక ఎత్తుల్లో సాధారణంగా విమానాలు పూర్తి సామర్థ్యంతో బరవు మోయలేవు. సీ17 సామర్థ్యం తగ్గించుకొన్నా.. 46టన్నులను తేలిగ్గా రవాణ చేయగలదు. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డుమార్గంలో కశ్మీర్‌ వైపు నుంచి తరలించే అవకాశం ఉంది. 

శతఘ్నుల తరలింపునకు షినూక్‌లు..

భారత్‌కు చెందిన శతఘ్నులను అత్యవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవల అమెరికా నుంచి కొనుగోలు చేసిన షినూక్‌ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇవి భారత్‌ వద్ద 15 వరకు ఉన్నాయి.  అదేసమయంలో దళాలు, ఆర్మర్డ్‌ వాహనాలను తీసుకెళ్లెందుకు సీ130 విమానాలు, ఎంఐ17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్‌ వద్ద 11 సీ130 విమానాలు, 11 సీ17గ్లోబ్‌మాస్టర్లు  సర్వీసులో ఉండగా. 220 ఎంఐ 17 హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిల్లో అన్ని లద్దాక్‌ సమీపంలోని దౌలత్‌బేగ్‌ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్‌ కాగలిగే సామర్థ్యం ఉన్నవి కావడం విశేషం.