2020
లిపులేఖ్, కాలాపానీలు మావే
భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటాం: నేపాల్ ప్రధాని
కాఠ్‌మాండూ: భారత్-నేపాల్ మధ్య వివాదస్పద ప్రాంతాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలు నేపాల్‌కు చెందినవేనని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అన్నారు. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ రూపొందించిన కొత్త పటాన్ని నేపాల్ మంత్రిమండలి మంగళవారం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఓలీ పార్లమెంటులో మాట్లాడారు. ‘‘నేపాల్‌కు చెందిన ఆ భూభాగాల్లో సైనికులను మోహరింపజేయడం ద్వారా భారత్ వాటిని వివాదాస్పదం చేసింది. భారత్ సైన్యం వచ్చిన తర్వాత నేపాల్ పౌరులను అక్కడకు వెళ్లనీయడం లేదు’’ అని చెప్పారు. ‘‘1962 నుంచి భారత్ అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఇప్పటివరకు మన పాలకులు ఆ విషయాన్ని లేవనెత్తేందుకే సంకోచించారు. మేం వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. వెనక్కి తెస్తాం’’ అని అన్నారు. 1816 నాటి బ్రిటిష్ ఇండియా-నేపాల్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘సుగౌలి ట్రీటీ’ ఆధారంగా కొత్త పటం రూపొందినట్లు కాఠ్‌మాండూ పోస్ట్ తెలిపింది. కాళీ నది జన్మస్థానమైన లింపియాధురను నేపాల్‌లో భారత్‌కు సరిహద్దుగా కొత్త పటంలో చేర్చినట్టు వివరించింది.