అసమర్థ జన్యువులతో కరోనా తీవ్రం
May 12 2020
కొవిడ్-19 సోకినా కొందరిలో కనిపించని ఇన్ఫెక్షన్ లక్షణాలు
మరికొందరిలో కొద్దిపాటి సమస్యలు
ఇంకొందరికి ప్రాణాపాయ పరిస్థితి
వైర్‌సను గుర్తించలేని జన్యువులు
ఉన్నవారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ
ఓఎ్‌సహెచ్‌యూ శాస్త్రజ్ఞుల వెల్లడి
కొవిడ్-19 సోకినవారందరిలోనూ లక్షణాలు ఒకేలా కనిపించట్లేదు. కొందరిలో కొద్దిగా.. మరికొందరిలో ఎక్కువగా.. ఇంకొందరికి ప్రాణాలకే ప్రమాదం కలిగించేంతగా లక్షణాలుంటున్నాయి. వృద్ధుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నా.. ఈ వైర్‌సను జయించిన వృద్ధులూ ఉన్నారు. పిల్లలూ ఉన్నారు. ఎందుకీ తేడా? అంటే.. వైరస్ సోకిన వ్యక్తుల్లోని జన్యువుల్లో తేడానే ఇందుకు కారణమని ఆరెగావ్ సైన్స్ అండ్ హెల్త్ యూనివర్సిటీ (ఓఎ్‌సహెచ్‌యూ) శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సాధారణంగా.. ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి రోగ నిరోధక వ్యవస్థకు సమాచారం అందించి, ఆ వైర్‌సలను చంపే ‘సైటోటాక్సిక్ టి సెల్స్’ను పంపాల్సిందిగా అప్రమత్తం చేసే ‘అలారం సిస్టమ్’ మన శరీరంలో ఉంటుంది. కానీ.. ఆ అలారం వ్యవస్థ అందరిలోనూ ఒకేలా ఉండదని ఓఎ్‌సహెచ్‌యూ శాస్త్రజ్ఞులు తెలిపారు. అందుకే వైరస్ ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటోందని వివరించారు.
అలారం ఇలా..
మనకు ఏదైనా వైరస్ సోకినప్పుడు ఈ అలారం వ్యవస్థ అప్రమత్తమవుతుంది. అందులో కీలకమైనవి.. మన జన్యువుల్లో ఉండే అల్లెలేలనే నిర్మాణాలు. ఈ అల్లెలేలలో కొన్ని.. కొన్ని తరహాల వైర్‌సలకు, పాథోజన్లకు ఎక్కువగా ప్రతిస్పందిస్తాయి. అవి ఎంత ఎక్కువగా ప్రతిస్పందిస్తే రోగ నిరోధక వ్యవస్థ అంత ఎక్కువ సమర్థంగా పనిచేస్తుంది. అవి ఎంత తక్కువగా ప్రతిస్పందిస్తే రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా అలాగే తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉండేవారిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు, తీవ్రత ఎక్కువగా ఉంటున్నాయి. మరీ తక్కువగా ఉంటే ప్రాణాలు కోల్పోతున్నారు. ఓఎ్‌సహెచ్‌యూ పరిశోధకులు తమ రిసెర్చ్‌లో భాగంగా.. మానవుల్లోని ‘హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ సిస్టమ్ (హెచ్‌ఎల్‌ఏ)’ను కంప్యూటర్ మోడల్ ద్వారా పరీక్షించారు. వ్యక్తుల హెచ్‌ఎల్‌ఏ పనితీరును వారి జన్యువుల్లోని అల్లెలేలే నిర్ధారిస్తాయి. ఒక్కో హెచ్‌ఎల్‌ఏ ప్రొటీన్ ఒక్కో అల్లెలేకు సంకేతం. వైర్‌సలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదట ఇవే గ్రహించి.. ఆ వైర్‌సల తాలూకూ పెప్టైడ్‌లకు (కరోనా వైరస్ శరీరభాగాలను తయారుచేసే అమైనో ఆమ్లాలకు) అతుక్కుంటాయి. ఇలా ఒక హెచ్‌ఎలే ప్రొటీన్ దేనికైనా అతుక్కుందంటే.. అది మన శరీరానికి సంబంధించినది కాదని.. వైరస్సో, ఇంకేదో వస్తువో వచ్చిందని రోగనిరోధక వ్యవస్థకు తెలుస్తుంది. మరోవైపు.. అలా శత్రు వైర్‌సలోని పెప్టైడ్‌కు అతుక్కున్న తర్వాత.. అల్లెలేలు వాటిని కణం ఉపరితల భాగానికి తీసుకెళ్తాయి. అవి అక్కడికి వచ్చాయంటే అర్థం ఆ కణం ఇన్ఫెక్ట్ అయిందని. వెంటనే రోగనిరోధక వ్యవస్థ ఆ కణాన్ని చంపేస్తుంది. ఇంతటి కీలకమైన హెచ్‌ఎల్‌ఏ రకాల్లో కొన్ని మాత్రమే కొవిడ్-19 వైర్‌సను బాగా ఎక్కువగా గుర్తిస్తున్నాయి.
ఉదాహరణకు.. ‘బి46:01’ రకం అల్లెలే.. కొవిడ్-19 వైర్‌సను గుర్తించడంలో చాలా బలహీనంగా ఉంది. గతంలో ఇదే అల్లెలే బలహీనంగా ఉన్నవారిలో సార్స్ ప్రభావం, వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అదే క్రమంలో.. ఈ అల్లెలే ఉన్నవారికి కొవిడ్-19 సోకినా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటోందని అంచనా. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని.. తమ అంచనా నిజమో కాదో ధ్రువీకరించుకునేందుకు వైరస్ బారిన పడినవారి శరీరంలోని జన్యువులను పరీక్షించాల్సి ఉందని ఓహెచ్‌ఎ్‌సయూ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.