అన్నన్నా.. వేషాలమారి ‘కరోనా’
29 Apr, 2020
ఇప్పటికే పది రూపాలు మార్చిన వైరస్
చైనాలో వైరస్ ‘ఓ’ రకానికి చెందినది
‘ఓ’ వైరస్ అత్యంత ప్రమాదకరమైనది
ఎన్‌ఐబీఎంజీ అధ్యయనంలో వెల్లడి
కరోనా వైరస్ వేషాలు వేస్తోంది. రంగుల్ని మార్చే ఊసరవెల్లిని తలదన్నుతూ రూపాన్ని మార్చుకుంటోంది. ఇప్పటికే పది రూపాల్ని మార్చిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ జినోమిక్స్ (ఎన్‌ఐబీఎంజీ) వెల్లడించింది. చైనాలోని వూహాన్‌లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ‘ఓ’ రకానికి చెందినది. ఆ వైరస్ ప్రపంచం వ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించే క్రమంలో ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటోందని ఎన్‌ఐబీఎంజీ తెలిపింది. ఏ–2, ఏ–2ఏ, ఏ–3, బీ, బీ–1, బీ–2.. ఇలా ఇప్పటివరకూ పది వేషాలు వేసిందని తెలిపింది. సార్స్ కోవ్–2 (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్–2) సోకడం వల్లే వచ్చే వ్యాధినే కోవిడ్–19(కరోనా)గా పిలుస్తున్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్(టీకా)తోనే పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చు. వైరస్ ఆర్‌ఎన్‌ఏ పరిణామ క్రమాన్ని విశ్లేషించగలిగితే టీకాను ఆవిష్కరించడానికి మార్గం సుగమమవుతుంది. ‘సార్స్ కోవ్– 2’ వైరస్ ఆర్‌ఎన్‌ఏ పరిణామ క్రమంపై ఎన్‌ఐబీఎంజీ ప్రొఫెసర్లు నిదాన్ బిశ్వాస్, పార్థ మజుందార్ అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ..
► పదేళ్ల క్రితం చైనాలో సార్స్ కోవ్ 8 వేల మందికి సోకింది. సుమారు 800 మందిని పొట్టన పెట్టుకుంది. గత డిసెంబర్‌లో వూహాన్‌లో సార్స్ కోవ్–2 పురుడు పోసుకుంది. దీన్నే నావల్ కరోనా వైరస్‌గా పేర్కొంటున్నారు. ఇది ‘ఓ’ రకానికి చెందినది.
► ‘ఓ’ రకం వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ఈ రకం వైరస్ మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఇది రూపాంతరం చెందే క్రమంలో 10 వేషాలు వేసింది.
► ఈ 10 రకాల్లో ఏ–2ఏ రకం వైరస్ అత్యంత క్రియాశీలకమైంది. ముక్కు, నోటి ద్వారా శరవేగంగా గొంతులోకి చేరుతుంది. ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో తిష్ట వేసి.. శరీరంలోని అవయవాలకు విస్తరిస్తుంది.
► జ్వరం, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు, చలి, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం ఈ వ్యాధి లక్షణాలు.
► ప్రపంచంలో కరోనా వ్యాధిగ్రస్తుల్లో 50.8 శాతం మందికి ఏ–2ఏ వైరస్ సోకింది. మన దేశంలో 47.5 శాతం మందికి సోకింది. ప్రస్తుతం ఇది మిగతా పది రకాల వైరస్‌లపై ఆధిపత్యం చెలాయిస్తోంది.
► వూహాన్‌లో బయటపడిన ఓ–రకంతో కలిపి మొత్తం 11 రకాల వైరస్‌ల ఆర్‌ఎన్‌ఏల పరిణామ క్రమాన్ని ఎన్‌ఐబీఎంజీ ఛేదించింది. టీకాను ఆవిష్కరించడానికి వైరస్ ఆర్‌ఎఎన్‌ల పరిణామ క్రమమే కీలకం.